
బాధితులకు చట్టపరిధిలో అండగా నిలవండి
రాయచోటి : న్యాయం కోసం పోలీసు స్టేషన్ గడప తొక్కిన బాధితులకు చట్టపరిధిలో అండగా నిలవాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలిచ్చారు. అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ స్వీకరించారు. సైబర్ మోసాలు, కుటుంబ సభ్యుల వేధింపులు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసాలు, ప్రేమ పేరుతో మోసాలు లాంటివి అధికంగా ఉన్నాయి. ప్రతి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా నేరుగా ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళల ఫిర్యాదులకు ప్రాముఖ్యతనిస్తూ సమగ్రంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ స్పష్టం చేశారు.