చిన్నారి మృతిపై అనుమానాలు | - | Sakshi
Sakshi News home page

చిన్నారి మృతిపై అనుమానాలు

Aug 26 2025 7:40 AM | Updated on Aug 26 2025 7:40 AM

చిన్న

చిన్నారి మృతిపై అనుమానాలు

కళాశాల సీసీ పుటేజీలో వెలుగు చూసిన వాస్తవాలు

13 రోజుల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం

కురబలకోట : ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొరుగింటి నీటి నిల్వ తొట్టెలో పడి చనిపోయాడని భావించి తల్లిదండ్రులు లేకలేక కలిగిన రెండేళ్ల పసిబిడ్డకు గుండె పగిలిన మనసుతో అంత్యక్రియలు నిర్వహించారు. దేవుడు మనకే ఎందుకు ఇంత క్షోభ మిగిల్చాడని కన్నీరు మున్నీరుగా విలపించారు. కానీ అసలు కథ సీసీ కెమెరాల ద్వారా వెలుగు చూసింది. బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోలేదని అనుమానాలకు దారితీసింది. దీంతో బిడ్డను పూడ్చిన 13 రోజుల తర్వాత సోమవారం తవ్వి తీసి అక్కడే డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె బసినికొండకు చెందిన చిన్నరెడ్డెప్పకు, కురబలకోట మండలంలోని భార్గవికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల వరకు పిల్లలు కలుగకపోవడంతో ఎన్నో పూజలు, మొక్కుబడులు చేశారు. రెండేళ్ల క్రితం ఎం. శ్యామ్‌ కృష్ణ జన్మించాడు. లేక లేక కలిగిన ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు. ఈ క్రమంలో భార్గవి ఈనెల 11న పెద్దకటవలోని పుట్టింటికి భర్త, బిడ్డతో కలసి వచ్చింది. 12న ఉదయం రెండేళ్ల చిన్నారి శ్యామ్‌ కృష్ణ ఒంటరిగా ఆడుకుంటూ కొంత దూరంలో ఉన్న పొరిగింటి వైపు వెళ్లాడు. ఆ తర్వాత కన్పించకుండా పోయాడు. ఊరంతా వెతికారు. చివరకు గంట తర్వాత పొరిగింటిలో బయట ఉన్న నీటి తొట్టెలో శవమై కన్పించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. బిడ్డ ప్రమాదవశాత్తు పడి చనిపోయాడని భావించి అదే రోజు బాధాతప్త హృదయంతో అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటికీ అనుమానం ఉంటే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పినా పసిబిడ్డకు పోస్టుమార్టం సరికాదని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రెండు రోజుల తర్వాత ఆ ఊరిని ఆనుకుని ఉన్న కళాశాల కెమెరాలను పరిశీలించారు. బిడ్డ పొరిగింటి వరకు వెళ్లడం అదే సమయంలో కొంత సేపటికే అదే ఊరికి చెందిన ఓ జంట ఆ ఇంటివైపు రావడం తిరిగి వెళ్లడం దృశ్యాలు కన్పించాయి. ఒక వైపు బిడ్డ మరో వైపు జంట పొరిగింటి వైపుగా వెళ్లినట్లుగా ఉన్న దృశ్యాలు మాత్రమే సీసీ కెమెరాలో కన్పిస్తున్నాయి. దీంతో అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తల్లిదండ్రులు బిడ్డ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బిడ్డ మృతిపై ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. దీంతో రూరల్‌ సర్కిల్‌ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో తహసీల్దారు ధనుంజయులు సమక్షంలో డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే భూమిలో పాతిపెట్టిన అమాయక పసిబిడ్డ మృతదేహాన్ని 13 రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం చేసిన దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు పొంగుకొస్తున్న దుంఖాన్ని ఆపుకోలేకపోయారు. అమాయక ప్రాణానికి న్యాయం జరగాలని తలచుకున్నారు. అంగళ్లు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్‌, సోషల్‌ వర్కర్‌ తుమ్మచెట్లపల్లె నాగరత్న పాల్గొన్నారు.

చిన్నారి మృతిపై అనుమానాలు1
1/1

చిన్నారి మృతిపై అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement