
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
● సన్నిహిత సంబంధమే హత్యకు కారణం
● వివరాలు వెల్లడించిన
ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
రాయచోటి టౌన్ : మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆయన కథనం మేరకు.. ఈ నెల 18వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండల పరిధిలోని దేవళంపల్లె ఫారెస్టులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్‌ఐ వి. సుధాకర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసి మృతురాలు మదనపల్లె మండలం, పొన్నేటిపాలెం, సవరంపల్లె గ్రామానికి చెందిన శ్రీదేవిగా గుర్తించారు. ఆమె ఫోన్ డేటా ఆధారంగా నిందితుడు సుండుపల్లె మండలం, మడితాడు గ్రామం నాయనివారిపల్లెకు చెందిన గురిగింజకుంట శివప్రసాద్ నాయుడుగా గుర్తించారు. మృతురాలితో నిందితుడు సన్నిహితంగా మెలిగేవాడని, ఈ క్రమంలో ఆమెను డబ్బుల కోసం వేధించేవాడని తెలుసుకున్నారు. దీంతో ఆమె తనతో ఉన్న సన్నిహిత సంబంధం గురించి అందరికీ చెబుతానని బెదిరించేది. డబ్బులు ఇవ్వకపోగా తననే బెదిరిస్తావా అని మనసులో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నెల 4వ తేదీ శివప్రసాద్ నాయుడుకు ఫోన్ చేసి తనను కలవాలని కోరింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు ఆమెను బైకుపై మదనపల్లె నుంచి చిన్నమండెం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఆమె చీరను మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసును తీసుకున్నాడు. తర్వాత అప్పటికే తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమైపె పోసి నిప్పు పెట్టాడు. బంగారు గొలుసు సుండుపల్లెలోని కీర్తన ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.1,31,000 రుణం తీసుకున్నాడు. సాంకేతిక పరి/్ఞానంతో నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకుని ఈ నెల 24వ తేదీ స్వచ్ఛందంగా లొంగిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పెడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటాద్రి, రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్‌ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.