
భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి
రాజంపేట : పుల్లంపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న భూ ఆక్రమణలను అడ్డుకొని పేదలను ఆదుకోవాలని పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి కోరారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏఓ శ్రీధర్‌రావుకు వినతిపత్రం అందజేసిన అనంతరం కబ్జా భూముల వివరాలను ఎంపీపీ మీడియాకు వివరించారు. పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం గ్రామంలో ముద్దా సుబ్బారెడ్డి సతీమణి లక్ష్మినరసమ్మ పేరు మీద 324 సర్వే నెంబరులో 3 సెంట్లు స్థలం ఉందన్నారు. ఈ 3 సెంట్ల స్థలాన్ని ఆసరాగా తీసుకొని వీరి కుమారుడు ముద్దా సుభాష్‌రెడ్డి అలియాస్ గంగిరెడ్డి సమీపంలో పలువురి భూములను 40 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారన్నారు. ఇదే విషయంపై పుల్లంపేట తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఇందులో ఉన్న గ్రామ కంఠం భూమి 6 ఎకరాలను కూడా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. వెంబులూరు సుబ్బన్న, చెన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి వంటి వారితో పాటు ఎంతో మందిని ఇబ్బంది పెట్టి వారి భూములను అక్రమించుకున్నారన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వీరికి బంధువు కావడంతో రెచ్చిపోయి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దళితుల భూములకు అండగా ఉండాల్సిన పుల్లంపేట తహసీల్దార్ అధికార పార్టీ నాయకులకు, ఆక్రమణదారులకు వత్తాసు పలకడమేమిటని ఆయన ప్రశ్నించారు.
పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి