
రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగించాలని అన్నమయ్య జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. ఆదివారం రాయచోటి పట్టణంలోని సాయిశుభ కళ్యాణ మండపంలో అత్యవసర సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలించాలన్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని వారు కోరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సీఎం చంద్రబాబుతో చర్చించి జిల్లా కేంద్రం మార్పును అడ్డుకోవాలని.. లేనిపక్షంలో ఉద్యమానికి సన్నద్ధం అవుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా సాధన సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ బయారెడ్డి, సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, విజయభాస్కర్, గంగిరెడ్డి, రామాంజులు, ప్రకాష్, మైనార్టీ నేత ఇర్షాద్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్‌రెడ్డి, న్యాయవాది రెడ్డప్పరెడ్డి, భాస్కర్‌రాజు పాల్గొన్నారు.