రాయచోటి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ల నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా కంటక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. రాయచోటిలోని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకం, అవినీతి, బంధుప్రీతి, దోపిడీలు అధికమయ్యాయని ఆరోపించారు. పథకాల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాలలో భారీగా కోత విధించారన్నారు. ఈ క్రమంలోనే దివ్యాంగుల పెన్షన్లలో నిజమైన అర్హులకు కూడా కోతకోసి వారికి గుండె కోతను మిగిల్చారన్నారు. చిలమత్తూరులో మహిళా ఎంపీపీపై టీడీపీ నాయకులు భౌతికంగా దాడి చేయడం దారుణమన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో సాక్షాత్తు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనకు సంబంధం లేని పోలింగ్ కేంద్రాలలో దౌర్జన్యం, అరాచకాలకు తెర తీశారన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, కేంద్రం నిధులు దోచేయడమే కూటమి ప్రభుత్వ పాలన పనిగా పెట్టుకొందన్నారు. పంచాయతీరాజ్ విభాగంలో 1130 సెక్రటరీలకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. మీడియా సమావేశంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి