
దారిమళ్లిన నాంధేడ్ వీక్లీ!
రాజంపేట: ప్రస్తుతం నాంధేడ్ నుంచి ధర్మవరం మధ్య నడుస్తున్న (07189/17190) వీక్లీ ప్రత్యేక రైలు దారిమళ్లనుంది. ఈ రైలు ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లె, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, వినుకొండ, నంద్యాల, ఎర్రగుంట్ల , కడప , తిరుపతి, పాకాల మార్గాల్లో నడిచేది. వచ్చే నెల నుంచి ఈ రైలు నిజమాబాద్, పెద్దపల్లె, వరంగల్ , విజయవాడ, గుడూరు, తిరుపతి, పాకాల మీదుగా నడపనున్నారు.
● మొదటిసారిగా పీలేరు, మదనపల్లె, కదిరి నుంచి ఉత్తర తెలంగాణాలోని జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లె, వరంగల్‌తో పాటు ఖమ్మం జిల్లాకు కూడా అనుసంధానం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి పీలేరు, కలికిరి , మదనపల్లె, కదిరి వెళ్లడానికి నేరుగా సౌకర్యం లేదు. ఇప్పుడు ఈ ప్రత్యేకరైలుతో తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, వికరాబాదు, గద్వాల ప్రాంతాలలో ఇప్పటికే మదనపల్లె, పీలేరు, కలికిరి అనుసంధానమై ఉన్నాయి.
● నాంధేడ్ ప్రత్యేక రైలుతో ఉత్తర తెలంగాణాతో మదనపల్లె , పీలేరుకు రైలుసౌకర్యం లభించినట్లైంది. సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఎగువమార్గంలో 4ట్రిప్‌లు, 07190 నంబరుతో ధర్మవరం నుంచి ఈ ఎక్స్‌ప్రెస్‌రైలు నడవనుంది.
● ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌రైలు 07189 నంబరుతో సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో నాంధేడ్‌లో సాయంత్రం 4.30కి బయలుదేరి, మరుసటిరోజు సాయంత్రం ధర్మవరం జంక్షన్‌కు 5గంటలకు చేరుకుంటుంది. అన్నమయ్య జిల్లాలో పీలేరు, మదనపల్లెరోడ్‌లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ఈ రైలులో అధునాతన ఎల్‌హెచ్‌బీ బోగీలు ఉన్నాయి. ఐఆర్‌టీఎస్ పోర్టల్‌లో బుకింగ్ సౌకర్యం కూడా ప్రారంభమైంది.