
ఇళ్ల స్థలాలపై ఆస్తిహక్కు కల్పించేందుకు స్వమిత్వ
సిద్దవటం : ఇళ్ల స్థలాలపై ఆస్తిహక్కు కల్పించేందుకు ప్రభుత్వం స్వమిత్వ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మీ తెలిపారు. సిద్దవటం మండల పరిషత్ సభా భవనంలో శనివారం పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లతో స్వమిత్వపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో స్వమిత్వలో వైఎస్సార్ కడప జిల్లా నాల్గవ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్ రమణారెడ్డి, డీఎల్‌పీఓ విజయ్ భాస్కర్, ఈఓపీఆర్‌డీ మెహెతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
భూ వివాదంలో ముగ్గురిపై దాడి
నిమ్మనపల్లె : పొలం వద్ద దారి కోసం ఏర్పడిన వివాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురిపై కొందరు దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. అగ్రహారం పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన జి.శ్రీనివాసులురెడ్డి(40)కు అదే గ్రామంలోని వెంకటరమణారెడ్డి, ఉదయ్‌శేఖర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డిలతో పొలం దారి విషయమై వివాదం నడుస్తోంది. ఈ విషయమై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయగా అధికారులు విచారించి శ్రీనివాసులురెడ్డికి అనుకూలంగా ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. దీంతో నిమ్మనపల్లె ఎస్‌ఐ ప్రత్యర్థి వర్గంలోని వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించి ఈ విషయమై అధికారుల సూచనల మేరకు నడచుకోవాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయని చెప్పి బైండోవర్ చేశారు. ఇంటికి వెళ్లిన ప్రత్యర్థులు మాపై ఫిర్యాదు చేస్తావా అంటూ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై దాడిచేసి కర్రలతో కొట్టారు. దాడిలో శ్రీనివాసులురెడ్డితో పాటు అతడి భార్య యమున, సోదరి రేణుక గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు.
డీఏపీ ద్రావణం పిచికారీతో మంచి దిగుబడులు
లక్కిరెడ్డిపల్లి : ప్రతి పంటకు డీఏపీ చల్లకుండా లిక్విడ్‌తో స్ప్రే చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివనారాయణ పేర్కొన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా శనివారం బి.ఎర్రగుడి పంచాయతీలోని చెంచర్లపల్లి, ఎర్రగుడి, మామిడిగారి పల్లి గ్రామాలలోని వేరుశనగ, కంది, ఆముదం పంటలకు డీఏపీ లిక్విడ్ స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కేవలం లీటరు రూ. 500 అని, డీఏపీ బస్తా అయితే రూ. 1700 అని లిక్విడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ జయరాణి, ఏఓ రాజకుమారి, ఏఈఓ అనూష, ఆర్‌ఎస్ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై కొలుములపల్లి సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద శనివారం తెల్లవారుజామున కారును గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ ప్రాంతానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు తిరుమల దర్శనం కోసం వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ నిర్లక్ష్యంగా నడిపిన కారణంగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు దెబ్బతింది. ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్ ఆపకుండా పారిపోయినట్లు సమాచారం.
గోపవరం : సెంచురీ పానెల్స్ పరిశ్రమను ఆర్డీఓ చంద్రమోహన్ శనివారం పరిశీలించారు. తహసీల్దార్ త్రిభువన్‌రెడ్డి, ఏడీఏ వెంకటసుబ్బయ్య, ఏఓ విజయరావుతో కలిసి పరిశ్రమలో జరుగుతున్న పనులను పరిశ్రమ ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం యూరియా కొరత ఉన్నందున పరిశ్రమలో ఉపయోగించే యూరియాపై ఆరా తీశారు. పరిశ్రమలో ఉపయోగించే యూరియాను కూడా స్థానిక వ్యవసాయాధికారుల ద్వారా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయానికి వాడే యూరియా కాదని నిర్ధారించారు. అనంతరం పరిశ్రమలో తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను పరిశీలించారు.