
బాధితులకు న్యాయం జరగాలి
రాయచోటి : సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్షక్షపడేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు కోర్టు మానిటరింగ్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పోలీసు స్టేషన్లకు చెందిన కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. కోర్టులలో చార్జ్ షీటు ఫైల్ చేసిన అనంతరం కోర్టు ద్వారా సంబంధిత కేసులలో సిసి నెంబర్లను తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పెండింగ్ సమన్లు జారీ అయ్యేలా, వారెంట్లు అమలు జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతనంగా అమలులోకి వచ్చిన బీఎన్‌ఎస్‌ఎస్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి కోర్టు కానిస్టేబుల్ విధిగా తన పోలీసు స్టేషన్‌కు సంబంధించి కోర్టులో హాజరవుతున్న ప్రతి కేసు గురించి అవగాహన పెంచుకొని సరియైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ ఎ ఆదినారాయణ రెడ్డి, డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్ ఎం తులసీరామ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ పి రాజా, రమేష్, టాస్క్‌ఫోర్సు ఇన్‌స్పెక్టర్ టి మధు, ఎస్‌ఐ జి రవికుమార్, కోర్టు మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.