
సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దు
● నల్లగుట్టపై కార్యక్రమాలకు అనుమతి లేదు
● ఐదుకిలోమీటర్ల పరిధి వరకు నిషేధాజ్ఞలు
● నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు
మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలోని నల్లగుట్టలో గౌతమబుద్ధ విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని సోషల్‌మీడియాలో వ్యాప్తి చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి, సీఐ కళావెంకటరమణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ...పట్టణానికి చెందిన పీటీయం.శివప్రసాద్ ఈనెల 23వతేదీ నల్లగుట్టపైన బుద్దవిగ్రహ ప్రతిష్టకు ప్రజలు తరలిరావాల్సిందిగా సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. నల్లగుట్ట చుట్టుపక్కల ఐదుకిలోమీటర్ల పరిధి వరకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టరాదని, ప్రజలు గుమికూడరాదని ఎంసీ.నెం.358/2025 కింద 21వ తేదీన నిషేధిత ఉత్తర్వులు జారీ చేశామన్నారు. నిషేధాజ్ఞలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కొనసాగుతాయన్నారు. ఈ విషయమై పీటీఎం.శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళితే, ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా, అతని ఫిర్యాదును కొట్టివేయడం జరిగిందన్నారు. అంకిశెట్టిపల్లె గ్రామరెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్.15లోని నల్లగుట్ట పూర్తిగా ప్రభుత్వానికి చెందిన భూమి, ఇందులో ఎవరూ ప్రవేశించరాదని కంచెను ఏర్పాటుచేశామన్నారు. శనివారం పట్టణంలో ర్యాలీ, నల్లగుట్టపై బుద్ధుని విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని, ఒకవేళ ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై వేసిన కేసును హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తామన్నారు.