
ఇసుక అక్రమ రవాణాతోనే విద్యార్థులు మృతి
రాజంపేట రూరల్ : చెయ్యేరులోని ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ దొరికితే అక్కడ అక్రమంగా తరిలించటం వలనే ఇంజినీరింగ్ విద్యార్థులు బలి అయ్యారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అభిప్రాయపడ్డారు. మండల పరిధిలోని బాలరాజుపల్లి వద్ద గల చెయ్యేరులోకి దిగి అన్నమాచార్య యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్థులు గురువారం మృతి చెందారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఉన్న వారి మృత దేహలను శుక్రవారం ఎమ్మెల్యే ఆకేపాటి చూసి చలించిపోయారు. వారికి నివాళులు అర్పించి వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైద్యులు డాక్టర్ అనీల్‌కుమార్‌తో చర్చించి వేగంగా పోస్టు మార్టం పనులు పూర్తి చేసి మృతి చెందినవారి తల్లిదండ్రులకు సహకరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడతూ ఎన్నో ఆశలతో విద్యనిభ్యశిస్తున్న విద్యార్థులు మృతి చెందటం భాదాకరమన్నారు. వారి తల్లిదండ్రుల కలలను నేరవేర్చే క్రమంలో ఈతకు వెళ్లి మృతి చెందటం విచారకరమన్నారు. మృతి చెందిన వారిలో రాజంపేట మండలం గాలివారిపల్లి చెందిన సోంబెత్తిన దిలీప్‌కుమార్, ఒంటిమిట్ట మండలం మడపంపల్లికి చెందిన కొత్తూరు చంద్రశేఖరరెడ్డి , పోరుమామిళ్లకు చెందిన పీనరోతు కేశవ ఉన్నారన్నారు. వీరికి ప్రభుత్వం నష్ట పరిహరం చెల్లించి ఆదుకోవాలన్నారు. ఆకేపాటి వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు పీ.విశ్వనాథరెడ్డి, దండు గోపీ, దాసరి పెంచలయ్య, జీవీ సుబ్బరాజు, మల్లికార్జునరెడ్డి, న్యాయవాదులు మూరి గోవర్దనరెడ్డి, పాటూరు భరత్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి