
కుట్రలో భాగంగానే దివ్యాంగ పింఛన్ల తొలగింపు
రాయచోటి: దివ్యాంగ పెన్షన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పెన్షన్లు తొలగింపుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నవాటిని తొలగించే పనిలో పడిందన్నారు. తొలి విడతగా దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్లపై కన్నేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే కొత్త పంథాకు తెరదీసి రీ వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్ పేరిట వికలాంగులంతా మరోసారి వైద్యుల వద్దకు వెళ్లి సదరం సర్టిఫికెట్ చేయించుకోవాలని షరతు పెట్టిందన్నారు. వికలత్వం ఎంత ఉందో వైద్యులతో ధ్రువీకరించి పర్సంటేజీతో సర్టిఫికెట్‌ను తీసుకురావాలని, కొత్త నిబంధలను ప్రవేశపెట్టిందన్నారు. దీంతో గత పది, పదిహేనుళ్లుగా పింఛన్ తీసుకుంటున్న వికలాంగులు సైతం మళ్లీ సదరం సర్టిపికెట్లు కోసం దరఖాస్తు చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకున్నారన్నారు. దివ్యాంగులను మానవతా దృక్పతంతో ఆదుకోవాల్సింది పోయి వారి జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త పెన్షన్లను మంజూరు చేసేవారన్నారు. అదే తరహాలో కూటమి ప్రభుత్వం చేయాలని కోరారు.
● జిల్లాలో 3774 మందికి పింఛన్లను తొలగిస్తున్నట్లు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఒక్క రాయచోటి నియోజకవర్గంలో 915 మందికి నోటీసులు ఇచ్చారన్నారు.సెప్టెంబర్ నుంచి వీరికి పెన్షన్లు వచ్చే అవకాశం ఉండదేమోనని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల శోకం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాలుకోసం నడవలేనివారిని తరచూ ఆసుపత్రుల చుట్టూ తిప్పడం సమంజసం కాదన్నారు.
● గత జగన్ ప్రభుత్వంలో పింఛన్‌దారుడు మృతి చెందితే మరుసటి నెల నుంచే ఆయన భార్యకు (స్పౌజ్) పెన్షన్ మంజూరు అయ్యేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ సైట్‌ను క్లోజ్ చేయడంతో ఈ తరహా పెన్షన్లు మంజూరు ఆగిపోయిందన్నారు. 2024 నవంబర్ తర్వాత మృతి చెందిన వారికి మాత్రమే స్పౌజ్ పింఛన్లను ఈ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. వీటినే కొత్త పెన్షన్లు అన్నట్టుగా కూటమి నాయకులు హడావిడి చేశారన్నారు. సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వమే సక్రమంగా ఇచ్చిందని తెలిపారు.
● నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు, దివ్యాంగులకు పెన్షన్ వస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వీటిని తొలగించడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే పింఛన్లను పునరుద్ధరించాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి