
20 పోలింగ్ కేంద్రాల పెంపునకు ప్రతిపాదనలు
పీలేరురూరల్ : పీలేరు అసెంబ్లీ 163 నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 20 పోలింగ్ కేంద్రాలు పెంచేందుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి బి. అమరనాథరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గం ఓటర్లలో పురుషులు 1,15,105 మంది, మహిళలు 1,19,954, ఇతరులు 21 మంది ఉన్నట్లు తెలిపారు. మొత్తం 2,35,080 ఓటర్లు ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో 1200 ఓటర్ల కంటే మించిన పోలింగ్ కేంద్రాలు 20 ఉన్నాయని, వాటిని పునర్విభజన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివకుమార్, డీటీ ప్రసాద్, ఏఎస్‌ఓ రెడ్డెప్పనాయుడు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.