
బస్సు పాసుల జారీ కౌంటర్ నిర్వాహకుడి తొలగింపు
రాజంపేట : రాజంపేట ఆర్టీసీ డిపోలో బస్‌పాస్ జారీ కౌంటర్ నిర్వాహకుడు కిషోర్‌ను విధుల నుంచి తొలగించామని రాజంపేట డిపో మేనేజర్ రమణయ్య తెలిపారు. గురువారం తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. గత కొంతకాలంగా విద్యార్థుల బస్సు పాసుల జారీ విషయంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. హార్టికల్చర్ విద్యార్థి అభిషేక్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. రెండు, మూడు రోజులుగా చార్జీలు చెల్లించి కళాశాలకు వెళుతున్న విద్యార్థికి అయిన చార్జీలు తాను చెల్లించి, బస్సు పాసు రెన్యువల్ చేసి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ మాధవి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీయూడబ్ల్యుజే జిల్లా నాయకుడు భాస్కర్ తదితరులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీఎంను కోరారు.