
మట్టి గణపతే.. మహా గణపతి
రాజంపేట టౌన్ : పండుగల్లోకెల్లా వినాయక చవితి పండుగ సంబరమైంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలు కలిసి మెలసి చవితి ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటారు. ఈనెల 27వ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉత్సవాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వినాయక చవితిని జరుపుకోవాలంటే ప్రధానంగా కావాల్సింది గణపయ్య విగ్రహం. అయితే చాలా మంది మార్కెట్‌లో సులువుగా దొరికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీఓపీ)తో తయారు చేసిన రంగురంగుల బొజ్జ గణపయ్యలను తెచ్చుకొని పూజిస్తారు. అయితే రసాయనాలతో తయారు చేసిన ఈ విగ్రహాల కంటే మట్టి విగ్రహాలను పూజిస్తే పర్యావరణానికి ఎంతో శ్రేయస్కరమని విద్యావంతులు చెబుతున్నారు. అలాగే సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే ముడిసరుకుతో చేసే వినాయక ప్రతిమలనే పూజించాలని పురాణాలు కూడా చెబుతున్నాయి.
మట్టితో మనిషికి విడదీయరాని బంధం
మట్టికి, మనిషికి విడదీయరాని బంధం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే మానవ మనుగడ ప్రకృతితో ముడిపడి వుంది. ప్రకృతి ఆరాధనతో మొదలైన పూజలు ఇప్పుడు విగ్రహ ఆరాధన వరకు వచ్చాయి. సాధారణంగా మిగతా దేవతా మూర్తుల విగ్రహాలను కళాకారులు రాయితో మలుచుతారు. అయితే వినాయక చవితి ఉత్సవాల అనంతరం స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేయాల్సి వున్నందున కళాకారులు సులువుగా విగ్రహాలను తయారు చేసేందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో గణపయ్య విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇటీవల కాలంలో విగ్రహాల ఏర్పాటు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. జిల్లాలో వేల సంఖ్యల్లో పెద్ద విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాల వల్ల పర్యావరణానికి పెనుముప్పు సంభవించే ప్రమాదముందని విద్యావంతులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
కొంతలో కొంత మార్పు..
గతంలో కంటే ప్రస్తుతం కొంత మార్పు వచ్చిందనే చెప్పాలి. వినాయక చవితి సందర్భంగా ఇళ్లల్లో కొలువుదీర్చే గణపయ్యలను ముఖ్యంగా విద్యావంతులు, పర్యావరణ ప్రేమికులు మట్టితో చేసిన విగ్రహాలనే కొలువుదీర్చి పూజలు చేస్తున్నారు. అందువల్ల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కళాకారులు మట్టితో చిన్న విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వినాయక చవితి పండుగకు అతి తక్కువ సమయం ఉండటంతో వ్యాపారులు మట్టితో తయారు చేసిన విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. మట్టితో తయారు చేసే విగ్రహాలకు మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే వీధుల్లో, గ్రామాల్లో ఏర్పాటు చేసే భారీ గణపయ్యలను కూడా మట్టితో చేసే విగ్రహాలనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
మట్టి విగ్రహాలతో కలిగే ప్రయోజనాలు ఇవీ
● సహజ సిద్ధంగా లభించే బంకమట్టితో చేసే విగ్రహాలు త్వరగా నీటిలో
కరిగిపోతాయి.
● మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసినా నీటి వనరులకు ఎలాంటి నష్టం
ఉండదు.
● కాలుష్యానికి ఎలాంటి హాని చేయదు. అందువల్ల స్వచ్ఛమైన గాలి,
వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.
రసాయన విగ్రహాల వల్ల కలిగే అనర్థాలు
● ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాలు త్వరగా నీటిలో కరగవు.
ఈ విగ్రహాల్లో జిప్సం, మెగ్నీషియం, పాదరసం, సీసం, కాడ్మియం, కార్బన్
వంటి అవశేషాలు ఉంటాయి.
● ఇలాంటి విగ్రహాలు నీటిని కలుషితం చేస్తాయి. ఈ నీటిని తాగితే జీర్ణకోశ
వ్యాధులు సంక్రమిస్తాయి.
● నీటిలో ఉండే చేపలు వంటి జీవరాసులు కూడా రోగాల బారిన పడతాయి.
● రసాయనాలు కలిసిన నీటి మూలంగా శరీరంలో నరాలపై ప్రభావం చూపి
కేన్సర్ వ్యాధికి దారితీస్తుంది. అలాగే చర్మవ్యాధులు సోకుతాయి.
● రసాయనిక రంగులు కలిసిన నీరు పంట పొలాలకు చేరితే దిగుబడులు
తగ్గిపోతాయి. అలాగే ఆహార ఉత్పత్తులను కలుషితం చేస్తుంది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు వద్దు..
మట్టి గణపతే ముద్దు