గంజాయి సరఫరా చేయలేదని హత్య | - | Sakshi
Sakshi News home page

గంజాయి సరఫరా చేయలేదని హత్య

Aug 22 2025 3:24 AM | Updated on Aug 22 2025 3:24 AM

గంజాయి సరఫరా చేయలేదని హత్య

గంజాయి సరఫరా చేయలేదని హత్య

ఎట్టకేలకు వీడిన పశ్చిమ

బెంగాల్‌ వాసి హత్యకేసు మిస్టరీ

ఇద్దరి అరెస్టు, మరో ముగ్గురి కోసం గాలింపు

మదనపల్లె రూరల్‌ : సీటీఎం రైల్వే ట్రాక్‌ పక్కన అనుమానాస్పదంగా పడవేసిన పశ్చిమ బెంగాల్‌ వాసి హత్యకేసు మిస్టరీ వీడింది. గంజాయి సరఫరా చేస్తానని డబ్బులు తీసుకుని, సరుకు పంపిణీ చేయకపోవడంతో గంజాయి వ్యాపారుల మధ్య జరిగిన వివాదంతోనే పశ్చిమబెంగాల్‌ వాసిని దారుణంగా హత్యచేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు రైలు పట్టాలపై పడేసినట్లు రైల్వే పోలీసులు విచారణలో నిగ్గు తేల్చారు. గురువారం కదిరి ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో హత్యకేసు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యలో మరో ఇద్దరి ప్రమేయం ఉందని, వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ధర్మవరం ప్రభుత్వ రైల్వే పోలీసు సీఐ అశోక్‌కుమార్‌ కథనం మేరకు.. పశ్చిమబెంగాల్‌ ముషీరాబాద్‌ జిల్లా ఇమాంనగర్‌కు చెందిన ఎస్‌.కే.మైమూల్‌ కుమారుడు షేక్‌ ఖాదీర్‌(30) ఐదేళ్ల క్రితం మదనపల్లె సమీపంలోని అంగళ్లుకు జీవనోపాధి నిమిత్తం వచ్చాడు. స్థానికంగా బేల్దారి పనులతో పాటు జేసీబీ కూలిపనులకు వెళ్లేవాడు. వీటితో పాటు ఒరిస్సా నుంచి ఎక్కువ మొత్తంలో గంజాయి తీసుకువచ్చి కిలో రూ.24వేల చొప్పున మదనపల్లెలో విక్రయించేవాడు. ఈ క్రమంలో మద్యం, గంజాయి తాగే అలవాటు ఉన్న మదనపల్లె మండలం బసినికొండలో నివాసం ఉండే పఠాన్‌ ఆసిఫ్‌ఖాన్‌(40)తో ఖాదీర్‌కు పరిచయం ఏర్పడింది. ఆసిఫ్‌ తల్లి గంజాయి విక్రేతగా అరెస్ట్‌ అయి గతంలో జైలుకు వెళ్లి వచ్చింది. ఆసిఫ్‌ తల్లి తెచ్చిన గంజాయిని తాగడంతో పాటు విక్రయించేవాడు. ఖాదిర్‌ వద్ద గంజాయిని కొనుగోలుచేసి స్నేహితులైన మౌలా, సుల్తాన్‌తో పాటు మరికొంతమందికి అమ్మేవాడు. నెలరోజుల క్రితం రెండు కిలోల గంజాయి కావాలని ఆసిఫ్‌, పశ్చిమబెంగాల్‌వాసి ఖాదిర్‌కు రూ.50వేల రూపాయలు ఇచ్చాడు. అయితే ఖాదిర్‌, ఆసిఫ్‌కు గంజాయి కానీ డబ్బులు కానీ ఇవ్వలేదు. ఈ విషయం ఆసిఫ్‌ తన మిత్రులైన మౌలా, సుల్తాన్‌లకు చెప్పడంతో వారు ముగ్గురు, మరో ఇద్దరిని వెంటబెట్టుకుని మొత్తం ఐదుగురు ఈనెల 15వతేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంగళ్లులో నివాసం ఉంటున్న ఖాదిర్‌ రూమ్‌కు చేరుకున్నారు. అతడిని బలవంతంగా సుల్తాన్‌కు చెందిన టయాటో ఇథియోస్‌ కారులో ఎక్కించుకుని కర్నాటకలోని రాయల్పాడు సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకువెళ్లారు. సాయంత్రం వరకు అతడిని అక్కడే ఉంచి, గంజాయి ఎక్కడ ఉంచావో చెప్పాల్సిందిగా నీలగిరి కర్రలతో కొట్టారు. ఖాదిర్‌ ప్రస్తుతం తన వద్ద గంజాయి లేదని తెప్పించి ఇస్తానని చెప్పడంతో అక్కడ నుంచి తిరిగి కారులో ఎక్కించుకుని రాత్రి 7 గంటల సమయంలో వన్‌టౌన్‌ పరిధిలోని దేవళంవీధిలోని ఇంటికి తీసుకువచ్చి, మరోసారి కర్రలతో తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తాళలేక ఖాదిర్‌ చనిపోయాడు. ఈ విషయం ఆసిఫ్‌, సుల్తాన్‌కు చెప్పగా, రైలు పట్టాలపై ఖాదిర్‌ శవాన్ని పడేస్తే ఏదో రైలు కింద పడి చనిపోయాడని భావిస్తారని చెప్పడంతో ఆటోలో మౌలాతో పాటు ఖాదిర్‌ శవాన్ని తీసుకుని 16వతేదీ తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో మదనపల్లె రోడ్‌ రైల్వేస్టేషన్‌ దగ్గరలోని రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ఖాదిర్‌ శవాన్ని రైలు పట్టాలపై పడేసేందుకు ఆసిఫ్‌, మౌలాలు తీసుకువెళుతుండగా, అంతలో ఒక వాహనం అటువైపుగా రావడంతో లైట్ల వెలుగు వారిపై పడటంతో తప్పించుకునే క్రమంలో బ్రిడ్జి మెట్లపై మృతదేహాన్ని పడేసి వచ్చిన ఆటోలో పారిపోయారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కీ మాన్‌ రైలు ట్రాక్‌ కిందిభాగంలో శవం ఉందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌నెం.14/2025 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. శవం పడి ఉన్న తీరు, ఒంటిపై ఉన్న గాయాలను గమనించి అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేస్తుండగా, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఖాదిర్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకు గురైనట్లు నిర్ధారించుకుని, కేసును హత్యకేసుగా మార్పుచేశారు. విచారణలో చివరిసారిగా ఖాదిర్‌ ఆసిఫ్‌తో కలిసి వెళ్లినట్లు గుర్తించి అతడి కోసం రైల్వే పోలీసులు గాలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆసిఫ్‌, మౌలాలు నేరుగా కదిరి రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. వీరి నుంచి ఆటో స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ అయిన నిందితుల్లో షేక్‌ మౌలా మదనపల్లె వన్‌టౌన్‌ పరిధిలో రౌడీషీటర్‌, 2016లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్యకేసులో మరో నిందితుడైన రౌడీషీటర్‌, 2016 మదనపల్లె వన్‌టౌన్‌ పరిధిలోని హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుల్తాన్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు రైల్వే సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. అరెస్ట్‌ చేసిన ఇద్దరు నిందితులు ఆసిఫ్‌, మౌలాలను గుంతకల్లు రైల్వే కోర్టులో రిమాండ్‌ నిమిత్తం హాజరుపరిచినట్లు తెలిపారు. మదనపల్లె వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దేవళం వీధిలో హత్య జరిగినట్లు విచారణలో తేలడంతో కేసును మదనపల్లె వన్‌టౌన్‌కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ బాలకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్‌ మహబూబ్‌బాషా, సిబ్బందిని గుంతకల్లు రైల్వే పోలీస్‌ ఎస్పీ రాహుల్‌మీనా, సబ్‌ డివిజన్‌ డీఎస్‌ఆర్పీ శ్రీనివాసాచారి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement