
నిబంధనలకు తూట్లు.. రైతులకు పాట్లు
గుర్రంకొండ: జిల్లాలోని వాల్మీకిపురం, గుర్రంకొండ, కలికిరి, కలకడ, పీలేరుల్లో మార్కెట్ యార్డులు ఉన్నాయి.వీటిల్లో ప్రభుత్వ నిబంధనలు అమలు కాక పోవడంతో రైతులు నష్టపోతున్నారు. వాల్మీకీపురం కొత్త మార్కెట్‌కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం జూన్‌నెల 16న గుర్రంకొండ మార్కెట్‌యార్డు ఉపకార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వ్యాపారులను పిలిపించి పాలకవర్గం సమావేశంలో తీసుకున్న నిబంధనలను అన్ని మండీలలో వ్యాపారులు అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం మండీల్లో అమలు చేస్తున్న 30 కేజీల క్రీట్ల స్థానంలో 15 కిలలో టమాటా క్రీట్లు ఏర్పాటు చేయాలి. జాక్‌పాట్ విధానం ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, తక్షణం దానిని రద్దు చేయాలన్నారు. ఇకపై వంద క్రీట్లకు 10 టమాటా క్రీట్లు జాక్‌పాట్ పేరుతో రైతుల వద్ద నుంచి తీసుకోకూడదన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాలుగుశాతం కమిషన్ మాత్రమే రైతుల వద్ద నుంచి వసూలు చేసుకోవాలని, పదిశాతం కమీషన్ తీసుకోకూడదని హెచ్చరించింది. అయినా కొత్తపాలకవర్గం విధానాలు ఒక్కటి కూడా మార్కెట్ యార్డుల్లో అమలుకు నోచుకోక పోవడం గమనార్హం
జాక్‌పాట్ పేరుతో నిలువుదోపిడీ
రెండునెలల క్రితం జాక్‌పాట్‌లు రద్దు చేయాలని మార్కెట్ కమిటీపాలక వర్గం ఆదేశాలు జారీ చేసింది. అయినా రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. పడమటి మండలాల్లో మదనపల్లె తర్వాత గుర్రంకొండ మార్కెట్‌యార్డు అతిపెద్దది. ప్రతినిత్యం 40 నుంచి 50 లారీలోడ్ల టమాటాలు ఇక్కడికి వస్తుంటాయి. సుమారు 30 టమాటా మండీలు నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడి వచ్చి టమాటాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే స్థానిక వ్యాపారులు జాక్ పాట్ పేరుతో రైతులను దగా చేస్తున్నారు. జాక్ పాట్ ఉండకూడదనేది ప్రభుత్వ నిబంధన. అయితే నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా జాక్‌పాట్‌లు నిర్వహిస్తున్నారు. ప్రతి వందక్రీట్లకు 10క్రీట్లు జాక్‌పాట్ వదులుతున్నారు. రైతులు వేలంపాటకు సిద్ధంగా ఉంచిన క్రీట్లపై మరో సారి ఎత్తుగా టమాటాలను వ్యాపారులు పోస్తున్నారు. మళ్లీ వేలం పాటల సమయంలో జాక్‌పాట్ అంటూ వందకు పదిక్రీట్లు తీసుకొంటున్నారు. ఈ లెక్కన వందక్రీట్లకు జాక్‌పాట్ పేరుతో 12క్రీట్లకు పైగా వ్యాపారులు దోచుకొంటున్నారు. మార్కెట్‌కమిటీ పాలకవర్గం ఆదేశాలు ఎక్కడా పాటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
15కిలోల టమాటా క్రీట్ల అమలు ఏది?
వాల్మీకిపురం మార్కెట్‌కమిటీ పరిధిలోని అన్ని మండీల్లో 15కిలోల టమాటా క్రీట్ల విధానం అమలు చేయాలని మార్కెట్ కమిటీ పాలకవర్గం వ్యాపారులను ఆదేశించింది. తమకు కొన్ని రోజుల గడువు కావాలని, తప్పకుండా ఈ విధానాన్ని అమలు చేస్తామని టమాటా వ్యాపారులు అంగీకరించారు. దీంతో రైతులకు జాక్‌పాట్ బెడద తప్పుతుందని పాలకవర్గం భావించింది. అయితే ఇంతవరకు చిన్న టమాటా క్రీట్లను ఏ ఒక్క మండీలోనూ అమలు చేయకపోవడం గమనార్హం. దీంతో రైతులు ఇప్పటికీ పెద్ద క్రీట్ల రూపంలో నష్టపోతున్నారు.
వేలంపాట ధరలో కోతలు
మండీల్లో వేలం పాటలో పాడిన ధరల్లో కూడా ఇప్పటికీ కోతలూ విధిస్తున్నారు. రూ. 1000 క్రీట్ ధర పలుకుతుంటే వేలం పాటలో అవే ధరలు పాడి మళ్లీ రశీదుల్లో లెక్కకట్టే సమయంలో రూ. 50 నుంచి రూ.100 వరకు కోత విధిస్తున్నారు. అందరి ముందర ఒక ధర పాడుకొని బిల్లుల్లో మాత్రం కోత విధిస్తున్నారు. ఓ వైపు జాక్‌పాట్, మరోవైపు 10 శాతం కమీషన్లు, వేలం పాట ధరల్లో కోతలతో రైతులు నష్టపోతున్నారు.
మార్కెట్‌యార్డులో నాలుగుశాతం కమిషన్, జాక్‌పాట్
రద్దు అని నామమాత్రపు బోర్డులు పెట్టిన దృశ్యం
మార్కెట్ కమిటీ పాలకవర్గంఆదేశాలను పట్టించుకోని వ్యాపారులు
టమాట ధరల్లో కోతలు
కర్షకుడికి తప్పని ఇబ్బందులు

నిబంధనలకు తూట్లు.. రైతులకు పాట్లు