
మోదీన్ సాహెబ్ పల్లెలో విష జ్వరాలు
సిద్దవటం : మండలంలోని మోదీన్ సాహెబ్ పల్లె ఎస్సీ కాలనీలో దాదాపు 10 మందికి విష జ్వరాలు సోకి గత వారం రోజులుగా మంచానికే పరిమితమయ్యారు. గ్రామంలో అధిక వర్షాల కారణంగా అపరిశుభ్రత పేరుకు పోవడంతో దోమలు కుట్టడం వల్ల జ్వరాలు వ్యాపించాయని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారు. గ్రామస్తులు వైద్య సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో మంగళవారం మాధవరం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వర పీడితులను గుర్తించి మందులను అందజేశారు. గ్రామంలో అపరిశుభ్రత వల్ల, సీజనల్ వ్యాధులు వ్యాపించాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ శ్రావణి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.