నాపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తావా.. నీకు బస్సుపాస్‌ ఇవ్వనుపో ! | - | Sakshi
Sakshi News home page

నాపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తావా.. నీకు బస్సుపాస్‌ ఇవ్వనుపో !

Aug 20 2025 5:37 AM | Updated on Aug 20 2025 5:37 AM

నాపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తావా.. నీకు బస్సుపాస్‌

నాపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తావా.. నీకు బస్సుపాస్‌

రాజంపేట ఆర్టీసీ డిపోలో

కౌంటర్‌ నిర్వాహకుడి బెదిరింపు

ఆర్టీసీ అధికారులు చెప్పినా

పట్టించుకోని వైనం

సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థి

రాజంపేట : రాజంపేట డిపోలో బస్సు పాసుల జారీ విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరికి వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేసిన ఫలితంగా, ఆర్టీసీ బస్టాండులో బస్‌పాస్‌ కౌంటర్‌ నిర్వాహకుడు కిషోర్‌ ఉద్యానవన కళాశాల విద్యార్థి కె.అభిషేక్‌కు పాసు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. బాధిత విద్యార్థి కథనం మేరకు వివరాలిలా.. రైల్వేకోడూరు నియోజకవర్గం అనంతరాజుపేటలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యానవన కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అభిషేక్‌ సీజన్‌ పాస్‌ తీసుకొని రోజు కళాశాలకు వెళ్లి వస్తుంటాడు. బస్‌ పాస్‌ రెన్యూవల్‌ చేసేందుకు వెళ్లిన ఈ విద్యార్థికి కౌంటర్‌ నిర్వాహకుడి నుంచి చేదు అనుభవం ఎదురైంది. పాసు రెన్యూవల్‌ చేయకుండా నిరాకరించారు. అంతటితో ఆగకుండా విద్యార్థిని బెదిరించారు. ఈ విషయాన్ని సదరు విద్యార్థి డీఎం రమణయ్య, సీఐ మాధవీలత దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించారు. నిర్వాహకునితో మాట్లాడారు. మీరెన్నయినా చెప్పండి నేను అభిషేక్‌కు పాస్‌ ఇవ్వను, ఇస్తే నా విలువ పోతుంది, బస్‌పాస్‌ కౌంటర్‌కు రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో వారు చేతులెత్తేశారు. తిరిగి ఈ విద్యార్థి జిల్లా కలెక్టర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. అలాగే సబ్‌కలెక్టర్‌ భావన దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వేడుకున్నాడు. గత నెలలో ఈ విద్యార్థి అభిషేక్‌ బస్సు పాసుల జారీ విషయంలో రూ.40 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ అధికారులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అప్పటి నుంచి కిషోర్‌ విద్యార్థిపై కక్షపెంచుకున్నాడు. సోమవారం పాసు రెన్యూవల్‌కు వెళితే నాపై ఫిర్యాదు చేస్తావా, నీకెంత ధైర్యం, పాసు ఇవ్వను ఎవరికై నా చెప్పుకోపో అంటూ దురుసుగా బెదిరించాడు. గత 30 సంవత్సరాలుగా కిషోర్‌ ఇక్కడ పాతుకుపోయి డిపో అధికారులను సైతం లెక్క చేయడంలేదని ఇతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

డీఎంపై కలెక్టర్‌ ఫిర్యాదు

రాజంపేట ఆర్టీసీ బస్టాండులో బస్‌పాసు కౌంటర్‌ నిర్వాహకుడు కిషోర్‌ వ్యవహారశైలికి అడ్డుకట్టవేయకుండా, హార్టికల్చర్‌ విద్యార్థి అభిషేక్‌కు పాసు ఇవ్వకుండా నిరాకరించిన వ్యవహారంపై డీఎం రమణయ్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలెక్టర్‌ను కలిసి బస్‌పాసుల జారీలో నిర్లక్ష్యం, అక్రమ వసూలు తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. బస్‌ రిజర్వేషన్లు, బస్‌పాసులు, ఏఎన్‌ఎల్‌ అన్నీ ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్లనే ఈ పరిస్ధితి అన్నారు. ఇప్పటికై నా విచారణ కమిటీని నియమించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement