
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
రామసముద్రం : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామసముద్రం మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం చొక్కాడ్లపల్లి పంచాయతీ కనగాని గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వారం క్రితం భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన సుబ్రమణ్యం తన పొలంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహం కాలేదని..
ములకలచెరువు : మనస్తాపంతో పురుగుల మందు తాగి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... మండలంలోని చౌడసముద్రం పంచాయతీ చెట్లవారిపల్లెకు చెందిన జి. వంశీకృష్ణారెడ్డి (30)కు వివాహం కాలేదు. డిగ్రీ వరకు చదువుకొని ఇంటి వద్దే ఉంటున్నాడు. వయస్సు వచ్చినా వివాహం కాలేదని, ఉద్యోగం సైతం లేకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భార్యతో గొడవ పడి..
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో భార్యతో గొడవపడి భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. కొత్తపల్లె పంచాయతీ కొత్త ఇండ్లుకు చెందిన నరసింహులు కుమారుడు కటారి రమేష్(45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య ప్రమీల, కుమారుడు క్రాంతి, కుమార్తె అనుష్క ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా రమేష్ మద్యానికి బానిసై తరచూ ఇంట్లో భార్యతో గొడవపడేవాడు. ప్రతిసారీ తాను చనిపోతానంటూ బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. అనంతరం మనస్తాపం చెందిన రమేష్ ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తరచూ బెదిరించడం మామూలే కదా అని కుటుంబ సభ్యులు కొంత సమయం వేచి చూశారు. అయినా తలుపు తీయకపోవడంతో కుమారుడు గదిలోకి తొంగిచూడగా, రమేష్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే స్థానికుల సహాయంతో తలుపులు తీసి రమేష్‌ను కిందకు దించి హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షిస్తుండగానే, పరిస్థితి విషమించి మృతి చెందాడు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య