
దాడి కేసులో నలుగురు టీడీపీ నాయకుల అరెస్టు
మదనపల్లె రూరల్ : తంబళ్లపల్లె నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరులో భాగంగా ఈనెల 15వతేదీ శుక్రవారం శంకర్‌యాదవ్ వర్గంలోని ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి కేసులో నలుగురు టీడీపీ నాయకులను మంగళవారం అరెస్టు చేశారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన మేరకు... ఈనెల 15న తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలం అవికేనాయక్ తండా సర్పంచ్ నటరాజ్ నాయక్(30), ములకలచెరువు మండల నాయునివారిపల్లెకు చెందిన ఐటీడీపీ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ సాగర్(35)పై మదనపల్లె మండలం చిప్పిలి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనం, కారులో వెంబడించి కర్రలు, రాడ్లతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితులు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తాలూకా సీఐ కళావెంకటరమణ విచారణలో భాగంగా నలుగురు టీడీపీ వ్యక్తులు దాడికి పాల్పడినట్లు గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కురబలకోట మండలం గౌడసానిపల్లెకు చెందిన పోలూరు శివశంకర(47), మదనపల్లె పట్టణం చౌడేశ్వరినగర్‌కు చెందిన రెడ్డివారి కార్తీక్‌రెడ్డి(24), కురబలకోట మండలం మట్లవారిపల్లెకు చెందిన రాజోళ్ల హరినాథ్(26), మదనపల్లెకు చెందిన పూసా శ్రీకాంత్‌రెడ్డి(25) ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు, కేజీబీవీ పాఠశాలల కాంట్రాక్టు ఉద్యోగులు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వనందుకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా మాట్లాడుతూ జీతాలు ఇవ్వాలని అనేక పర్యాయాలు గ్రీవెన్‌సెల్‌లో, సర్వశిక్ష అభియాన్ అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వేతనాలు అందక కుక్‌లు, అసిస్టెంట్ కుక్‌లు, వాచ్‌మెన్లు, పార్ట్ టైమ్ టీచర్ల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం, ఆటంకం కలిగించకుండా విధులు నిర్వహిస్తూ వస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించే విషయంలో మంత్రి నారా లోకేష్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు.