
సమస్యల పరిష్కారంపై నిబద్ధత అవసరం
రాజంపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. మంగళవారం రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రాజంపేటలోని బైపాస్‌లో ఉన్న కళాంజలి కల్యాణ మండపంలో రెవెన్యూ పరిపాలన, పారదర్శకత, సమయపాలన, ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పని చేయడంపై రెవెన్యూ శాఖ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన వినతులను సకాలంలో పరిష్కారించాలన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ వివాదాల దరఖాస్తులు, భూముల రీసర్వే, రికార్డుల అప్డేషన్ తదితర అంశాల్లో రెవెన్యూ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. ప్రతి అధికారి నిజాయితీ, పారదర్శకతో సేవలందించాలన్నారు. ప్రజలను కార్యాల యాల చుట్టూ తిప్పుకోవద్దన్నారు. నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వరాదన్నారు. మెరుగైన సర్వీసులు అందించాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా పని తీరు మెరుగుపరుచుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ మెజిస్టీరియల్ పవర్స్, భూమి రికార్డుల శుద్ధి, భూ ఆక్రమణలపై విచారణ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించామన్నారు. డీఆర్వో మాట్లాడుతూ ప్రజలతో వ్యవహరించే విధానం తీరుతెన్నుల గురించి వివరించారు. సమావేశంలో రాజంపేట సబ్‌కలెక్టర్ భావన తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంపై నిబద్ధత అవసరం