
పెద్ద చెరువును చెరబట్టారు
గాలివీడు : మట్టి మాఫీయా బరితెగింపునకు అడ్డు అ దుపూ లేకుండా పోతోంది. వాగులు, వంకలు, గుట్ట లు ఇలా ఒకటేమిటి కనిపించిన ప్రతి చోటా మట్టిని తరలిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. అడ్డుకట్ట వేయలేని రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేసింది. తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పెద్ద చెరువులో జేసీబీ యంత్రాలతో విచ్చలవిడిగా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మంగళవారం ఉదయం దర్జాగా జేసీబీ సాయంతో ట్రాక్టర్లకు మట్టిని నింపి ప్రధాన రహదారులపై తరలిస్తుంటే కనీసం అటువైపు కన్నెత్తి చూసే వారు లేరు. మొన్న పేరాలగుట్ట, నిన్న గుర్రాల మిట్ట నేడు పెద్ద చెరువు ఇలా ఒకటేమిటి కనబడిన చోటల్లా మట్టిని తవ్వి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిద్రావస్థలో ఉన్నారంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.