
తలసేమియా బాధితుడికి పీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం
రాయచోటి జగదాంబసెంటర్ : రామాపురం మండలం నీలకంఠ్రావుపేట గ్రామానికి చెందిన పఠాన్ జాబీర్ అహమ్మద్ కుమారుడు షకీల్ అహమ్మద్ తలసేమియా వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. ఈ వ్యాధి చికిత్సకు లక్షలాది రూపాయలు అవసరమవుతుండగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబానికి వైద్యఖర్చులు భారంగా మారాయి. తమ కుమారుడి విషమ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ షకీల్ తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని ఆశ్రయించారు. ఆయన వెంటనే స్పందించి ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసును ప్రధానమంత్రి జాతీయ ఉపశమననిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) పరిధిలోకి తీసుకురావాలని, తగిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి కూడా వెంటనే స్పందిస్తూ షకీల్ మెడికల్ డాక్యుమెంట్లు, సంబంధిత ధ్రువపత్రాలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. వారి చొరవకు స్పందనగా ప్రధానమంత్రి కార్యాలయం, షకీల్‌కు బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్‌లో మేజర్ తలసేమియా చికిత్స నిమిత్తం రూ.3 లక్షల ఆర్థికసాయాన్ని మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ మిథున్‌రెడ్డికి, వెంటనే స్పందించి మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.