
దళారుల మోసాన్ని అరికట్టండి
ఓబులవారిపల్లె : దళారుల చేతిలో బొప్పాయి రైతులు మోసపోతూనే ఉన్నారని, కలెక్టర్ స్వయంగా నిర్ణయించిన ధర కంటే రైతులకు తక్కువగా చెల్లిస్తున్నారని రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వేకోడూరు బొప్పాయి పంట రేట్లు దళారులు తగ్గించడంతో ఈనెల 1వ తేదీన జిల్లా కలెక్టర్ బొప్పాయి రైతులతో, దళారులతో సమావేశం నిర్వహించారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కనీస ధర రూ. 9 అమలు చేయాలని, 6వ తేదీ నుంచి పది రూపాయలు అమలు చేయాలని నిర్ణయించారన్నారు. 6వ తేదీ వరకు రూ.9 అమలు చేసిన దళారులు ఆ తర్వాత ఎనిమిది రూపాయలకు, ప్రస్తుతం ఏడు రూపాయలకు తగ్గించారని ఆరోపించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస ధర రూ.15గా నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్, రైతు సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.