
సిమెంట్ లారీ ఢీకొని హోంగార్డు దుర్మరణం
మదనపల్లె రూరల్ : సిమెంట్ లారీ ఢీకొని హోంగార్డు దుర్మరణం చెందిన ఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం కోటకొండ తాండాకు చెందిన షేకే నాయక్, చౌడమ్మ దంపతుల కుమారుడు ఈశ్వర్ నాయక్(50) మదనపల్లెలో హోంగార్డు యూనిట్‌లో పనిచేస్తూ సబ్ కలెక్టరేట్ కార్యాలయ నైట్‌డ్యూటీ విధులు నిర్వహిస్తుంటాడు. సొసైటీ కాలనీ గేటులో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య లక్ష్మీబాయి స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తోంది. కుమారుడు హర్షవర్ధన్ నాయక్ ఇంజనీరింగ్ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా, కుమార్తె భవ్యశ్రీ డిగ్రీ చదువుతోంది. ఈశ్వర్ నాయక్ సోమవారం స్వగ్రామమైన కోటకొండ తాండా నుంచి ద్విచక్రవాహనంలో విధులకు హాజరయ్యేందుకు మదనపల్లెకు వస్తుండగా, మార్గమధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద సిమెంట్ కంటైనర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఈశ్వర్‌నాయక్ తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. స్థానికులు ముదివేడు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా ఈశ్వర్ నాయక్‌కు ఇద్దరు అక్కలు ఈశ్వరమ్మ, శంకరమ్మ, చెల్లెలు పార్వతి ఉండగా, వారి కుటుంబాలకు అన్ని విషయాల్లోనూ చేదోడువాదోడుగా ఉండే సోదరుడు మృతి చెందడంతో వారు జిల్లా ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు.