
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : సమస్యలపై అర్జీలు అందించే వారికి అండగా నిలిచి చట్టపరిధిలో వాటిని పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను ఎస్పీ స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులకు వేధింపులు, భూ ఆస్తి వివాదాలు తదితర సమస్యల గురించి ఫిర్యాదుదారులు విన్నవించుకున్నారు. వీటిపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్‌లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు.
ఒంటిమిట్ట రామయ్యకు రూ.10లక్షల ఆదాయం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి నెలవారి హుండీ ఆదాయం సోమవారం టీటీడీ అధికారులు లెక్కించారు. జూలై 18 నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా 10 లక్షల, 23 వేల, 681 రూపాయల నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
వైభవంగా పల్లకీసేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడుకి భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి ఆలయంలోని మూల విరాట్‌లకు అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. మాఢవీధిలో, ఆలయ ఆవరణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్యస్వామి,శేఖర్ స్వామి, రాచరాయ యోగీ స్వామి, భక్తులు పాల్గొన్నారు.
పింఛా ప్రాజెక్టు నుంచి
నీటి విడుదల
సుండుపల్లె : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పింఛా ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరదనీరు వచ్చింది. ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ఈనేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. సోమవారం సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. పింఛా ప్రాజెక్టు కెపాసిటీ 327.60 ఎంసీఎఫ్‌టీలకు చేరుకుందన్నారు. ప్రాజెక్టు నుంచి కిందకు నీటిని విడుదల చేయడంతో కుడికాలువ ఆయకట్టు ద్వారా 2,211 ఎకరాలకు, ఎడమ కాలువ ఆయకట్టు ద్వారా 1,562 ఎకరాలకు మొత్తం 3,773 ఎకరాలకు సాగు, తాగునీటి అవసరాలకు నీటిని అందించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అదే విధంగా ప్రాజెక్టు దిగువున ఉన్న గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ వెంకట్రామయ్య, డీఈ చెంగల్‌రాయులు, తహసీల్దార్ మెహబూబ్‌చాంద్, నీటిపారుదల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం చేయాలి

బాధితులకు న్యాయం చేయాలి

బాధితులకు న్యాయం చేయాలి