
మద్యం కేసులో ముద్దాయిలకు దేశ బహిష్కరణ !
● కువైట్‌కు మళ్లీ రాకుండా
నిషేధిత జాబితాలో పేర్లు
● అరెస్టు అయిన వారిలో
కడప జిల్లా వాసులు
రాజంపేట : కల్తీమద్యం, నాటుసారా బాధితులను కువైట్ దేశం బహిష్కరించింది. దేశం విడిచివెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వారు కూడా కువైట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఎవరెవరు ఉన్నారనేది మాత్రం ఇండియన్ ఎంబీసీ వెల్లడి చేయడంలేదు. దీంతో గల్ఫ్ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
భవన నిర్మాణ కార్మికులలో అలజడి
కల్తీ మద్యం దుర్ఘటనతో విస్తృత తనిఖీల్లో భాగంగా కువైట్ పోలీసులు ముతల్లా (కొత్తగా నిర్మితమవుతున్న ప్రాంతం)లో తనిఖీలు చేశారు. అనధికారికంగా అనేక మంది తెలుగువారు ఉండటాన్ని గుర్తించారు. వారిని అరెస్టు చేశారు. ఆర్టికల్ 20 కింద వచ్చిన వారంతా నివాసపత్రాలు సరిగ్గా లేకపోవడంతో కార్మికులను కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ప్రాంతంలో భవన నిర్మాణ, కార్మిక రంగానికి చెందిన వారు అధికంగా ఉన్నట్టు అక్కడివారు తెలియజేశారు. బేల్దారి, పెయింటర్స్, కూలీలుగా పనిచేసేందుకు కువైట్‌కు వెళ్లిన వారి కుటుంబాల్లో అలజడి మొదలైంది. ఈ వింగ్‌లో ఉమ్మడి కడప జిల్లా నుంచి అనేకమంది వెళ్లారని కువైట్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 18 కింద కువైట్‌లో ఉన్న కార్మికులలో అనేక మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
మహబుల్లాలో 23 మందికి పైగా ప్రాణాలను విషాదకరంగా బలి తీసుకున్నట్లుగా 71 మంది వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రెఫర్ చేశారు. ఇలా ఉంటే మహబుల్లాలో తనిఖీ చేసిన అక్కడి పోలీసులు 278 మందిని అరెస్టు చేయగా ఇందులో ఉమ్మడి కడప జిల్లా వాసులు కూడా ఉన్నారనే సంకేతాలు గల్ఫ్ కుటుంబీకుల ద్వారా అందుతోంది. ఏపీలో పలు జిల్లాలకు చెందిన తెలుగువారు కూడా కల్తీ మద్యం దుర్ఘటనలో బాధితులుగా ఉన్నారని సమాచారం సంబంధీకులకు చేరుతోంది.
తిరిగి రాకుండానే..
విషపూరిత మద్యం తాగి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాసాంధ్రులందరూ మరోసారి కువైట్‌కు రాకుండా ఆ దేశాధికారులు వారి పేర్లను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో అప్పులు చేసి కువైట్ వెళ్లిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. అటు అనారోగ్యం, మరోవైపు అప్పులతో ఇంటిముఖం పడుతున్నారు. తిరిగి తాము కోలుకుంటామో లేదా అన్న బెంగ బాధితులను వెంటాడుతోంది. కువైట్‌కు వెళ్లి నాలుగు రాళ్లు వెనుకేసుకుందామని అనుకుంటే కల్తీ, నాటుసారా నట్టేట ముంచేసింది.
కల్తీమద్యం కేంద్రాలకు
సీల్ వేస్తున్న కువైట్ పోలీసు
కువైట్‌లో నాటుసారా కేంద్రంలో
పట్టుబడిన తయారీదారులు

మద్యం కేసులో ముద్దాయిలకు దేశ బహిష్కరణ !