
భూమి ఆన్‌లైన్ కోసం బాధ భరిస్తూ..
రాయచోటి : రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఊపిరితిత్తు ల వ్యాధితో బాధపడుతున్న తనకు ఊపిరిపోయేలా ఉందని బాధితుడు మర్రిపాటి శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి ఆక్సిజన్ సిలిండర్‌తో తనకున్న సమస్యను గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌కు విన్నవించుకోవడానికి వచ్చారు. కలకడ మండలం రాతిగుంటపల్లి పంచాయతీ దేవలపల్లికి చెందిన మర్రిపాటి శంకరయ్యకు నడిమిచర్ల పంచాయతీలోని సర్వే నంబర్ 733/1లో 5 ఎకరాల 19 సెంట్లు భూమి ఉంది. 1970లో దళితులకు ప్రభుత్వం పట్టాలిచ్చి వ్యవసాయం చేసుకొనేలా అవకాశం కల్పించిందన్నారు. అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ భూమి గ్రామానికి చెందిన వెంకటరాయుడు, రెడ్డప్పల పేరు మీద ఆన్‌లైన్ అయిందన్నారు. భూమికి సంబంధించిన రికార్డులు కూడా మా దగ్గరే ఉన్నాయన్నారు. రికార్డుల ప్రకారం మా భూమిని సర్వే చేసి మా పేరున ఆన్‌లైన్ చేయాలని కలకడ తహసీల్దార్‌ను కోరామన్నారు. స్థానికంగా ఉన్న వీఆర్‌ఓ, సర్వేయర్, డీటీలు కలిసి మా భూమి మాకు చెందనీయకుండా ఇతరులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టర్‌కు ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తనకు వైద్యుల సలహా మేరకు రోజుకు 17 గంటలు ఆక్సిజన్‌ను సిలిండర్ ద్వారా తీసుకోవాల్సి ఉందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నాకు భార్య పిల్లలు కూలి పనిచేసి వైద్యం అందిస్తున్నారన్నారు. అనారోగ్యంతో ఉన్న నేను నా భార్యతో కలిసి స్థానిక రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా వారి నుంచి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితిలో కలెక్టర్‌కు సమస్యను విన్నవించుకోవడానికి వచ్చినట్లు శంకరయ్య తెలిపారు.
ఆక్సిజన్ సిలిండర్‌తో
కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుడు