కోళ్లబైలులో కబ్జాల జోరు | - | Sakshi
Sakshi News home page

కోళ్లబైలులో కబ్జాల జోరు

Aug 17 2025 6:33 AM | Updated on Aug 17 2025 6:33 AM

కోళ్ల

కోళ్లబైలులో కబ్జాల జోరు

కబ్జాదారులకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు..

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నా

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

ఆక్రమిత స్థలాలను విక్రయించి

సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నాయకులు

అధికారంలో ఉన్నది మేమే...

మీకేమీ కాదంటూ భరోసా

నిజమని నమ్మి మోసపోతున్న

బడుగు, బలహీన వర్గాల ప్రజలు

మదనపల్లె రూరల్‌ : కోళ్లబైలు. పేరుకు పంచాయతీ అయినప్పటికీ, పట్టణానికి ఆనుకుని ఉండటం, చుట్టుపక్కల కొండలు, గుట్టలు...కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాలు ఉండటంతో... అటు కబ్జాకోరులకు, ఇటు రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా...కోళ్లబైలు ఆక్రమణలను అరికట్టిన దాఖలాలు లేవు. ఎవరికి వారు సొసైటీలు, కులసంఘాలు, కమ్యూనిటీ భవనాలు, గుడుల పేరుతో కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేసి, రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని యథేచ్ఛగా విక్రయించుకుంటున్నారు. పట్టణంలో భూముల ధరలు అమాంతం పెరిగిన నేపథ్యంలో.. మధ్యతరగతి, చేనేత వర్గాలకు చెందిన అమాయకులు తక్కువ ధరకు వస్తున్నాయని ఆశతో, దళారుల మాయమాటలు నమ్మి మోసపోయి స్థలాలను లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. తాము అమ్మే స్థలాలకు దొంగ పట్టా సృష్టించి ఇవ్వడంతో పాటు పునాది వేసి ఇల్లు నిర్మాణం జరుపుకుని, కరెంటు మీటరు వచ్చేంతవరకు తమదే పూచీ అంటూ కబ్జారాయుళ్లు భరోసా ఇస్తుండటంతో నిలువునా నమ్మి మోసపోతున్నారు. కోళ్లబైలు పంచాయతీలో సుమారు 2వేలకు పైగా ఇళ్లు నిర్మించి ఉంటే, అందులో అసలైన లబ్ధిదారులు, అర్హులు 1,200 మంది ఉంటే.. మిగిలిన 800 ఇళ్లు బినామీలు, అనర్హులు, అక్రమమార్గంలో దక్కించుకున్నవే ఉన్నాయి. ఇవన్నీ రెవెన్యూ, పంచాయతీ అధికారులకు తెలిసి జరుగుతున్నప్పటికీ, వారు రాజకీయ జోక్యం, డబ్బులకు ఆశపడి తమకెందుకులే అని వదిలేస్తున్నారు. ఎప్పుడైనా మీడియాలోనో, లేక స్థానికంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగి ఆక్రమణల విషయం బయటకు వచ్చినప్పుడు రెండు రోజులు రెవెన్యూ అధికారులు హడావిడి చేసి, ఐదారు పునాదులు జేసీబీతో తొలగించి ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోళ్లబైలు పంచాయతీలో దళారుల దందాలు అధికమయ్యాయి. టీడీపీలో ద్వితీయశ్రేణి నాయకులుగా చెప్పుకుంటున్న నాయకులు కోళ్లబైలును అడ్డాగా చేసుకుని ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు వెళ్లి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే.. అధికార పార్టీ నాయకుడినని బెదిరించడం, ఎమ్మెల్యే నుంచి ఫోన్‌ చేయించడం చేస్తున్నారు. దీంతో వాళ్లు తమకెందుకులే అని వదిలేసి పోతుంటే, తమ్ముళ్లు దర్జాగా కోటీశ్వరులైపోతున్నారు. ఏడాది క్రితం వరకు టూవీలర్స్‌లో తిరిగి, అంతంతమాత్రంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు.. 14నెలలకే బొలేరో, ఇన్నోవా వాహనాలతో ఎమ్మెల్యే కాన్వాయ్‌లో తిరిగే స్థాయికి ఎదిగారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కోళ్లబైలు పంచాయతీకి ర్యెగులర్‌ వీఆర్వోను నియమించకపోవడంతో ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతున్నాయి. కోళ్లబైలుపై మదనపల్లె సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌ ప్రత్యేక దృష్టి సారించి, ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే తప్ప ఆక్రమణలకు అడ్డుకట్ట పడే అవకాశం లేదు. పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే గుట్టలు చదును చేసి, కోళ్లబైలు రూపు రేఖలు మారిపోయే అవకాశం ఉంది.

కోళ్లబైలు పంచాయతీ శేషాచల కాలనీలో అక్రమ నిర్మాణాలు, వెలుగుస్కూల్‌ వెనుక వైపున టీడీపీ నాయకుడు సొసైటీ రామచంద్ర చేసిన అక్రమ నిర్మాణాలు

కోళ్లబైలు పంచాయతీ వెలుగు స్కూల్‌ వెనుక వైపున చేస్తున్న అక్రమ నిర్మాణాలకు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారు. కబ్జాకోరులతో కుమ్మకై ్క ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరుపుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం, కరెంటు మీటర్లు ఇప్పించడం చేస్తున్నారు. 15–20 లక్షల విలువచేసే స్థలాలు కబ్జా అవుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కబ్జాలు చేసిన వారిపైన, సహకరించిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలి. – మురళీ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి.

కోళ్లబైలులో కబ్జాల జోరు 1
1/2

కోళ్లబైలులో కబ్జాల జోరు

కోళ్లబైలులో కబ్జాల జోరు 2
2/2

కోళ్లబైలులో కబ్జాల జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement