ఆరా తరహాలో డీటీఈ ఎర్నింగ్‌ యాప్‌క్లోజ్‌..! | - | Sakshi
Sakshi News home page

ఆరా తరహాలో డీటీఈ ఎర్నింగ్‌ యాప్‌క్లోజ్‌..!

Aug 17 2025 6:33 AM | Updated on Aug 17 2025 6:33 AM

ఆరా తరహాలో డీటీఈ ఎర్నింగ్‌ యాప్‌క్లోజ్‌..!

ఆరా తరహాలో డీటీఈ ఎర్నింగ్‌ యాప్‌క్లోజ్‌..!

అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసిన మరో కొత్త మోసం

కురబలకోట : వీడియో టాస్కులు చూడండి..డబ్బులు సంపాదించండి..స్పిన్‌ గిఫ్ట్‌తోపాటు వారానికోసారి మనీ విత్‌ డ్రా అంటూ ప్రచారంలోకి వచ్చిన ఆరా ఎర్నింగ్‌ యాప్‌తో ఇటీవల వేల మంది మోసపోయారు. ఈ మోసాన్ని మరువక మునుపే ఇదే తరహాలో ఉన్న డీటీఈ ఎర్నింగ్‌ యాప్‌ క్లోజ్‌ అయినట్లు వెలుగులోకి వచ్చింది. మూడు వారాలుగా డబ్బు విత్‌ డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించి నిట్టూరుస్తున్నారు. చెప్పుకుంటే సిగ్గు చేటు అన్నట్లుగా బాధితులు గమ్మున ఉంటున్నారు. ఆరా యాప్‌ బాధితులు కూడా ఇందులో ఉండడం విశేషం. బాధితుల కథనం మేరకు.. ఆరా తరహాలో ఆరునెలల క్రితం డీటీఈ ఎర్నింగ్‌ యాప్‌ ప్రచారంలోకి వచ్చింది. రూ. 2 వేలు డిపాజిట్‌ చెల్లిస్తే డీవన్‌, రూ.10 వేలు డిపాజిట్‌ చెల్లిస్తే డీ టు ఇలా డిపాజిట్‌కు తగ్గట్టుగా ప్లాన్‌ ప్రకటించారు. డిపాజిట్‌ చెల్లించి యాడ్స్‌ చూస్తే అధికంగా డబ్బు వస్తుందని ప్రచారంలోకి వచ్చింది. కొంత కాలం ప్రతి శుక్రవారం విత్‌ డ్రాల్స్‌ జరిగాయి. ఆశకుపోయి చాలా మంది చేరారు. అయితే వరుసగా మూడు వారాలుగా విత్‌ డ్రా కాలేదు. టెక్నికల్‌ సమస్య అని ఒక వారం, ఆడిట్‌ జరుగుతోందని ఇంకో వారం నమ్మబలుకుతూ వచ్చారు. ఈ శుక్రవారమైనా వస్తుందని ఆశించారు. తీరా చూస్తే నో డేటా అని యాప్‌లో కన్పించింది. అంతేకాదు రూ. 1380 అదనంగా చెల్లించి ఈకేవైసీ చేసుకుంటే ఐడీ యాక్టివ్‌ అవుతుందని మెసేజ్‌ పెట్టారు. యాప్‌ పనిచేయకపోవడం ఆపై కొత్త నిబంధనలు పెట్టడం విత్‌ డ్రాల్స్‌ను నిలిపి వేయడంతో ఈజీ మనీ ఆశలు ఆవిరయ్యాయి. పైగా యాడ్స్‌ కూడా ఓపన్‌ కాలేదు. దీంతో వరుసగా మూడు శుక్రవారాలు డబ్బులు విత్‌ డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించి ఆశలు వదిలేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా డీటీఈ యాప్‌ నిర్వాహకులు ఎక్కడుంటారన్నది ఎవ్వరికీ అంతుబట్టిని విషయం. ఇదో తరహా సైబర్‌ మోసం. ప్రధాన కార్యాలయం యూఎస్‌ఏలోని న్యూయార్క్‌, కొలరాడోలో ఉన్నట్లు యాప్‌లో సమాచారం పొందుపరిచారు. నిర్వాహకులను ప్రత్యక్షంగా చూసిన వారు గాని మాట్లాడిన వారు గాని లేరు. మెసేజ్‌ల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండెడ్స్‌ నైక్‌, అడిడాస్‌, వెర్సాస్‌, డిఫ్టిక్‌, బోస్‌, టయోటా లాంటి కంపెనీలతో కూడిన యాడ్స్‌ పెట్టారు. నిర్ణీత డిపాజిట్టు చెల్లించి యాడ్స్‌ చూడడం వల్ల డబ్బు వస్తుందని ఆశ పడ్డారు. చివరకు నిరాశను మిగిల్చింది. మోసపోతారు..జాగ్రత్త అని ఎంత చెప్పినా ఆశ ముందు ఇవి పనిచేయలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. డీటీఈ ఎర్నింగ్‌ యాప్‌ నిర్వాహకులు మాత్రం దమ్ముంటే పట్టుకోండన్నట్లుగా భారీ దోపిడికి పాల్పడి యాప్‌ను పథకం ప్రకారం క్లోజ్‌ చేసి చేతులెత్తేశారు. ఇలాంటి కేసులు పోలీసులకే సవాల్‌గా మారుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement