
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వేడుకలు
రాయచోటి టౌన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు దినోత్సవం సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం రాయచోటిలో వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గ్రూప్ –1 అధికారుల వరకు సభ్యులు ఉన్న సంఘం తమదేనన్నారు. జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్‌సీ ఎరియర్స్, డీఏ ఎరియర్స్, సరెండర్ లీవ్స్ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం రండి టీ తాగుతూ..మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు ఏ. సాయికుమార్, కోశాధికారి సురేష్ బాబు, ఉపాధ్యక్షులు నాగేంద్రప్రసాద్, వేణు, పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు రాజా, రమేష్, శ్రీను, మణికంఠ, నాగదేవ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల కవాతు విజయవంతం
– పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ
రాయచోటి : జిల్లా పోలీసు పేరెడ్ మైదానంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకలలో పోలీసులు ప్రదర్శించిన కవాతు విజయవంతం కావడంపై పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అభినందించారు. దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం ఈ కవాతులో స్పష్టంగా కనిపించాయన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
తాగునీటి కోసం అగచాట్లు
సిద్దవటం : మండలంలోని సంటిగారిపల్లె గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులకు గత 5 రోజులుగా తాగునీరు రాకపోవడంతో పొలాల్లోకి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి చెందిన మంచినీరు మోటారు చెడిపోవడంతో కాలనీలోని దాదాపు 40 కుటుంబాలకు తాగునీరు రావడం లేదన్నారు. దీంతో ప్రతి రోజు గ్రామ సమీపంలోని పొలాల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. తాగునీటి సమస్య గురించి సంబంధిత అధికారులకు తెలియజేసినా స్పందించలేదని వాపోయారు. ఉన్నతాధికారులు తమ కష్టాలను గుర్తించి ఎస్సీ కాలనీకి తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వేడుకలు