
బైక్‌లు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
బి.కొత్తకోట : ఎదురెదుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి స్థానిక పీటీఎం రోడ్డులో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం మేరకు..పీటీఎం మండలం ముంతగోగులపల్లెకు చెందిన శ్రీహరి (21), బి.కొత్తకోట మండలం కంబాలపల్లెకు చెందిన విష్ణు (21)లు బైక్‌పై బి.కొత్తకోట నుంచి మల్లెలకు బయలుదేరారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి వెంకటరమణ (70) పీటీఎం నుంచి బైక్‌పై బి.కొత్తకోటకు వస్తున్నారు. ఈ రెండు బైక్‌లు పీటీఎంరోడ్డులోని రాజా ఫంక్షన్ హాలు వద్దకు రాగానే ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరమణ తలకు తీవ్ర గాయమైంది. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు.
కారు ఢీకొని వృద్ధురాలి మృతి
పీలేరురూరల్ : కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గాయంవారిపల్లె వద్ద జరిగింది. సదుం మండలం కమ్మొళ్లపల్లె పంచాయతీ బల్లావారిపల్లెకు చెందిన కె. సుగుణ (65) శనివారం తన కుమార్తె ఇంటికి మండలంలోని గాయంవారిపల్లెకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో పీలేరు – మదనపల్లె జాతీయ రహదారి గాయంవారిపల్లె బస్టాప్ వద్ద రోడ్డుపైకి వచ్చింది. ఈ సమయంలో మదనపల్లె వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.
దారి కోసం ఘర్షణ
రామసముద్రం : దారి కోసం గొడవ పడిన వివాదంలో ఒక వ్యక్తికి గాయాలైన సంఘటన రామసముద్రం మండలంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మానేవారిపల్లి పంచాయతీ మిట్టచీమనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు వెళ్లే దారిలో గ్రామానికి చెందిన వెంకటరెడ్డి తదితరులు దారిని మూసివేశారు. ఇది గమనించిన శ్రీనివాసులు తన ఇంటి వద్ద కళ్ల వేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, సుధాకర్, వంశీ, చిన్నప్పలు దాడి చేశారు. దీంతో శ్రీనివాసులు తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబీకులు రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బైక్‌లు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు