
విష పురుగు కుట్టి రైతు మృతి
సిద్దవటం : రైతు పొలానికి నీరు కట్టేందుకు వెళ్లాడు. వరికి నీరు కడుతుంటే విషపురుగు కుట్టి రైతు మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. సిద్దవటం మండలం వెలుగుపల్లె గ్రామానికి చెందిన రైతు పాజర్ల వెంకటయ్య(45) అలియాస్ పుల్లయ్య శనివారం తన వరి పంటకు నీరు కట్టేందుకు వెళ్లాడు. అక్కడ పొలానికి నీరు కడుతుండగా నీళ్లలో విషపురుగు వెంకటయ్యను కుట్టింది. దీంతో వెంకటయ్య పొలం పక్కనే ఉన్న రైతు వెంగయ్యకు చెప్పడంతో ఆయన వెంకటయ్యను ద్విచక్రవాహనంలో భాకరాపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా వైద్యుడు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లగా కడప రిమ్స్ వైద్యుడు డాక్టర్ దినేష్ పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య వెంకటసుబ్బమ్మ, కూతురు లక్ష్మిదేవి ఉన్నారు. మృతుని భార్య వెంకటసుబ్బమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర తెలిపారు.