
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
రాయచోటి : బాధితుల ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని అదనపు ఎస్పీ తెలిపారు.
డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలి
రాయచోటి : మదనపల్లె డివిజన్ అభివృద్దికి అన్ని శాఖల సహకారంతో ముందుకు సాగాలని నూతన సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన చల్లా కల్యాణికి జిల్లా కలెకట్ ఛామకూరి శ్రీధర్ సూచించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ను మదనపల్లి సబ్ కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణిని అభినందించారు. అనంతరం మదనపల్లిలోని తన కార్యాలయంలో సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతల స్వీకరణ
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి మున్సిపల్ కమిషనర్‌గా జి.రవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయానికి టీపీఆర్‌ఓగా బదిలీ అయ్యారు. ఏపీ గ్రీనరీ, బ్యూటిఫికేషన్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న జి.రవి రాయచోటి కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. ఈయన గతంలో తాడిపత్రి, మదనపల్లి, ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. పట్టణంలో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తామని, స్వచ్ఛ రాయచోటినే లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రమాణ స్వీకారానికి
మంత్రి హాజరు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని రాజ్‌రెసిడెన్సీలో జరిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి ప్రమాణ స్వీకారానికి సోమవారం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అనంతరం ఆయన వెంటనే వెళ్లిపోయారు. మొదటిసారి కోడూరుకు వచ్చినప్పటికీ అభివృద్ధిపై సమీక్షించకుండా, హామీలు ఇవ్వకుండా పర్యటన ముగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్‌చార్జి ముక్కారూపానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మైలవరం నుంచి
నీటి విడుదల
జమ్మలమడుగు : మైలవలరం జలాశయం నుంచి పెన్నానదికి నీటిని విడుదల చేసినట్లు ఈఈ రమేష్ పేర్కొన్నారు. గండికోట జలాశయం నుంచి ఐదువేల క్యూసెక్కుల నీరు మైలవరం జలాశయంలోకి వస్తోందని ఆయన తెలిపారు. ఈ నీటిని దిగువనున్న పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నామన్నారు. సోమవా రం ఉదయం 1500 క్యూసెక్కులు సాయంత్రానికి ఐదు వేల క్యూసెక్కుల నీరు జలాశయం నుంచి దిగువకు పోతుందన్నారు.

ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి

ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి

ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి