
ఘనంగా హర్‌ఘర్ తిరంగా ర్యాలీ
రాయచోటి : ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఘనంగా నిర్వహించారు. సోమవారం రాయచోటిలో విద్యా, పర్యాటకతోపాటు పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ జెండా ఊపి ప్రారంభించారు. రాయచోటిలోని చిత్తూరు రోడ్డు వద్ద ఉన్న శివాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు నిర్వహించారు. అక్కడ విద్యార్థిని, విద్యార్థులతోపాటు కలిసి అధికారులు, సిబ్బంది మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడ జాతీయ గీతాన్ని ఆలపించారు. ర్యాలీలో వంద మీటర్ల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో జిల్లా పర్యాటకశాఖ అధికారి నాగభూషణం, డీఐఈఓ రవికుమార్, డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ అజయ్ కుమార్, డీఈఓ సుబ్రమణ్యం, డీఎస్పీ కృష్ణమోహన్, జీఎస్‌డబ్ల్యూ లక్ష్మీపతి, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, ఎంపీడీఓ సురేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల బాల బాలికలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.