
ఎన్నికల ప్రక్రియపై సూచనలు కీలకం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్
రాయచోటి : ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు కీలకమని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అన్నమయ్య జిల్లాలో ఓటర్ల సవరణ – 2025, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, వివిధ రకాల ఫారంలు తదితర అంశాలపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో గత సమావేశంలో చర్చించిన వివిధ విషయాలు, సంబంధిత చర్యలను డీఆర్‌ఓ మధుసూధనరావు క్లుప్తంగా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీఎల్‌ఏలను నియమించి సంబంధిత నియామక పత్రాలను ఈఆర్‌ఓలకు సమర్పించాలని తెలిపారు. బీఎల్‌ఓలపై సమీక్షిస్తూ జీఎస్‌డబ్ల్యూఎస్ శాఖలో బదిలీల కారణంగా చాలా మంది బీఎల్‌ఓలు మారారని సంబంధిత వివరాలను రాజకీయ పార్టీలకు అందజేయాలని డీఆర్‌ఓకు సూచించారు. సమావేశంలో రాజంపేట మదనపల్లె సబ్ కలెక్టర్లు హెచ్‌ఎస్ భావన, చల్ల కళ్యాణి, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్, కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ నిర్మూలనపై అవగాహన
రాయచోటి జగదాంబసెంటర్ : ఇండియా ఫైట్స్ హెచ్‌ఐవీ అండ్ ఎస్‌టీఐ అనే థీమ్‌తో హెచ్‌ఐవీ నిర్మూలనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ మండలి(డీఏపీసీయూ) రూపొందించిన గోడపత్రికను పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ గోడపత్రికలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ లేదా ఇతర సుఖ వ్యాధులు పట్ల అవగాహనతో ఎక్కువ మంది హెచ్‌ఐవీ రక్త పరీక్షలు చేసుకునేలా ముందుకు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల ఉన్న చిన్నచూపు, వివక్షతను రూపుమాపేందుకు హెచ్‌ఐవీ చట్టం 2017, టోల్‌ఫ్రీ నంబర్ 1097 మొదలైన వాటిపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఈ ఆవిష్కరణలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వైద్య శాఖ అధికారి లక్ష్మీనరసయ్య, పీసీఎస్‌ఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ టి.స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు.