మహానాడులో మదనపల్లె జిల్లా ప్రకటించాలి
మదనపల్లె రూరల్ : కడపలో జరుగుతున్న మహానాడులో మదనపల్లె జిల్లాను ప్రకటించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీయం.శివప్రసాద్ డిమాండ్ చేశారు. మహానాడులో మదనపల్లె జిల్లా ప్రకటనకు డిమాండ్ చేస్తూ స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మదనపల్లె జిల్లా సాధన సమితి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లక్రితం మహానాడు సందర్భంగా మదనపల్లెలో నిర్వహించిన మినీ మహానాడులో, టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల సందర్భంగా గత ఏడాది మదనపల్లె బెంగళూరు బస్టాండ్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో మదనపల్లె జిల్లా ఏర్పాటు తన బాధ్యతగా పేర్కొన్నారన్నారు. అలాగే యువగళం పాదయాత్ర సందర్బంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ రొంపిచెర్ల, మదనపల్లె సభల్లో మాట్లాడుతూ..తాము అధికారం చేపట్టిన మొదటి ఆరు నెలల్లో మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలను కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటుచేస్తామని ప్రకటించారన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా...ఇప్పటికీ మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించలేదని విమర్శించారు. సమావేశంలో మదనపల్లె జిల్లా సాధన సమితి నాయకులు ముత్యాల మోహన్, టి.ఏ.పీర్‌బాషా, కోనేటి దివాకర్‌రావు, బురుజురెడ్డి ప్రసాద్, గంగాధర్, రవిశంకర్, బి.నరసింహులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


