పోలీసుస్టేషన్ ముందు టీడీపీ నేత భార్య నిరసన
● భర్త వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు
● పోలీసులు న్యాయం చేయడంలేదని ఆరోపణ
మదనపల్లె రూరల్ : తన భర్త టీడీపీ నాయకుడు మహబూబ్‌ఖాన్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తమను పట్టించుకోకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని.. అయితే, టీడీపీ నేతనైన తనపైనే కేసు పెడతావా అంటూ తన భర్త తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహబూబ్‌ఖాన్ భార్య జోయాఖాన్ శుక్రవారం ఆవేదన వ్యక్తంచేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ కుమార్తెతో కలిసి మదనపల్లి టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆమె నిరసన చేపట్టింది. బాధితురాలికి ఏఐటీయూసీ మదనపల్లె నియోజకవర్గం కార్యదర్శి షేక్ ముబారక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జోయాఖాన్ మాట్లాడుతూ.. తన కనీస అవసరాలకు కావాల్సిన ఆర్థిక వనరులను తన భర్త సమకూర్చకపోగా, బాధ్యత లేకుండా తిరుగుతూ తనను నిత్యం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. ఈ విషయమై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనప్పటికీ అతడిలో మార్పు రాలేదని ఆమె ఆరోపించింది. రెండ్రోజుల క్రితం అర్ధరాత్రి వేళ ఆయన తన ఇద్దరు స్నేహితులతో ఇంటిపైకి వచ్చి దాడిచేశాడని.. దీంతో తాను 112 నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశానని తెలిపింది. అయినప్పటికీ పోలీసులు తనకు న్యాయం చేయకపోవడంతో కుమార్తెను తీసుకుని స్టేషన్ ఎదుట నిరసన చేపట్టిన్నట్లు చెప్పింది. మహబూబ్‌ఖాన్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ముబారక్ డిమాండ్ చేశారు.


