రుణాలపేరిట మోసపోయిన మహిళ ఆత్మహత్యాయత్నం
రాయచోటికి చెందిన మహిళ నగదు కాజేసిందని ఆరోపణ
మదనపల్లె రూరల్ : కేంద్ర ప్రభుత్వ సెక్టార్ లో పనిచేస్తున్నానని, రూ. 3 వేల నగదు చొప్పున కడితే రూ.5 లక్షల నగదు ఒక్కొక్కరికి రుణంగా ఇప్పిస్తానని చెప్పి రాయచోటికి చెందిన ఫరీదా అనే మహిళ తనను మోసం చేసి నగదు కాజేసిందని ఆరోపిస్తూ, మదనపల్లె రామారావు కాలనీకి చెందిన మహిళ రూప (27) శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె వెల్లడించిన వివరాల మేరకు మదనపల్లె పట్టణం రామారావు కాలనీలో నివాసం ఉంటున్న రూప తో రెండు సంవత్సరాల క్రితం రాయచోటికి చెందిన ఫరీదా అనే మహిళ తాను సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం ఇన్చార్జినని, మహిళల ఆర్థిక అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందిస్తుందని నమ్మబలికి పరిచయం పెంచుకుంది. రుణాల మంజూరుకు ఒక్కొక్కరు మూడు వేల రూపాయలు కడితే రూ.5 లక్షల రుణం వస్తుందని చెప్పింది. ఈ విషయాన్ని నమ్మి రూప దళారిగా వ్యవహరించి, తన సొంత పూచికత్తుతో 200 మందికి పైగా మహిళల వద్ద నగదు వసూలు చేసి ఫరీదా కు ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా రుణాలు మంజూరు కాకపోవడంతో డబ్బు కట్టిన మహిళలు రూపపై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయమై రూప ఫరీదాతో మాట్లాడినా, ఆమె అదిగో ఇదిగోనంటూ కాలయాపన చేసింది. అయితే నగదు చెల్లించిన మహిళలు తమ డబ్బు వాపస్ ఇవ్వాల్సిందిగా నిలదీయడంతో, ఒత్తిడి భరించలేక పోయింది. మోసం చేసిన మహిళపై రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో, ఇంటి వద్ద విషం తాగింది. టూ టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.


