అన్నమయ్యా.. పాలకుల కళ్లు తెరపించవయ్యా
● గోవిందా..గోవిందా అంటూ వేడుకోలు
● రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్
● హైవేపై రాస్తారోకో చేసిన జేఏసీ నేతలు
● వంటావార్పు, నినాదాలు
రాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ, పాలకుల కళ్లు తెరపించాలని వేడుకుంటూ జేఏసీ ఆధ్వర్యంలో నేతలు, వివిధ పార్టీల నాయకులు, యువకులు, విద్యార్ధులు మూకుమ్మడిగా పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహానికి వినతులు సమర్పించుకున్నారు. కడప–రేణిగుంట జాతీయరహదారిలోని 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌తో ప్రజాపోరును అన్నమయ్య ఎదుట శుక్రవారం నిర్వహించారు. గోవిందా..గోవిందా అంటూ ముక్తకంఠంతో వేడుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల దృష్టి కేంద్రీకరించేలా చేయాలంటూ అన్నమయ్యను వేడుకున్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ఉద్యమకారులు కొండూరు శరత్‌కుమార్‌రాజు, చిట్వేలి రవి కుమార్, మర్రి రవికుమార్, మండెం అబూబకర్, పూల భాస్కర్, యల్లటూరు శ్రీనివాసరాజు, డా.సుధాకర్, ఉద్దండం సుబ్రమణ్యం, యద్దల సాగర్, మేడికొండు రవి, కెఎంఎల్ నరసింహా, సంజీవి, సమ్మెట శివప్రసాద్, యల్లటూరు శివరామరాజు, కొట్టే హరి, సికిందరులతో పాటు మహిళలు పాల్గొన్నారు.
హైవేపై రాస్తారోకో
అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద ప్రజల వినతి ముగిసిన అనంతరం అన్నమయ్య ఉద్యానవనం ఎదురుగా కడప–రేణిగుంట జాతీయ రహదారిపై ఉద్యమకారులు రాస్తారోకోకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. కడప, తిరుపతి వైపు వాహనాలు బారులు తీరాయి. మన్నూరు సీఐ ప్రసాద్‌బాబు పర్యవేక్షణలో పోలీసు బందోబస్తును నిర్వహించారు.
న్యాయవాద జేఏసీ నాయకుడు
శరత్ ఆధ్వర్యంలో వంటావార్పు
అన్నమయ్యకు వినతుల కార్యక్రమం అనంతరం న్యాయవాదుల జేఏసీ కన్వీనరు కొండూరు శరత్‌కుమార్ రాజు ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపక్కన వంట చేయించారు. ఆందోళనకారులకు వడ్డించారు. కార్యక్రమంలో శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్, బీవీఎన్ హైస్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంగా రాజంపేట ఉండాలని ఈ సందర్భంగా నినదించారు. ప్రజల వినతులను ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు.
అన్నమయ్యా.. పాలకుల కళ్లు తెరపించవయ్యా


