వైఎస్సార్‌సీపీ నాయకులు అరెస్ట్
● జగనన్న పుట్టినరోజు వేడుకలు చేశారని కేసు
● గుర్రంకొండ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
● పాకాల కోర్టులో బెయిల్ మంజూరు
గుర్రంకొండ : గుర్రంకొండలో వైఎస్సార్‌సీపీ మండల పార్టీ కన్వీనర్ ముక్తియార్ అలీఖాన్, మాజీ సర్పంచ్ జమీర్ ఆలీఖాన్‌లను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇటీవల పట్టణంలో నిర్వహించిన జగనన్న పుట్టినరోజు వేడుకల్లో జరిగిన సంఘటనలపై కేసు నమోదు చేశారు. దీంతో గుర్రంకొండ పోలీస్‌స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రాత్రంతా నాయకుల్ని పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. శుక్రవారం తిరుపతి జిల్లా పాకాల కోర్టులో వీరిని హాజరు పరచగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల 21న మండలకేంద్రమైన గుర్రంకొండలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాత్రి వరకు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్‌లు కట్‌చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సమయంలో కార్యకర్తలు కత్తులతో కేక్ కట్ చేశారు. పచ్చమీడియా దీనిని వక్రీకరించి ప్రజలను భయాందోళనకు గురి చేశారంటూ, కత్తులతో సైర్వవిహారం చేశారంటూ వార్తలను ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం పోలీసులు రాష్ట్ర ఎండీసీ మాజీ డైరెక్టర్ హరీష్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ ముక్తియార్ ఆలీఖాన్, మాజీ సర్పంచ్ జమీర్ అలీఖాన్‌లపై కేసు నమోదు చేశారు. వీరిలో ముక్తియార్ అలీఖాన్, జమీర్ అలీఖాన్‌లను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకొన్న కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకొన్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డితో పాటు పలు పోలీస్‌స్టేషన్‌లకు చెందిన ఎస్‌ఐలు తమ సిబ్బందితో గుర్రంకొండకు చేరుకొన్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీస్‌స్టేషన్లోనే రాత్రంగా ఉంచారు. శుక్రవారం ఉదయం పదిగంటలకు ముక్తియార్ అలీఖాన్, జమీర్ అలీఖాన్‌లను పోలీసులు మొదటగా పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుపతి జిల్లాలోని పాకాల కోర్టులో వీరిని పోలీసులు హాజరుపరిచారు. కేసు విచారించిన జడ్జి వీరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో నాయకులు హర్షం ప్రకటించి గుర్రంకొండకు చేరుకొన్నారు.
గుర్రంకొండలో పోలీసుల పహారా
రెండురోజులుగా పట్టణంలో జరుగుతున్న సంఘటనలపై పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. గత రెండురోజులుగా జిల్లాలోని ఆరు పోలీస్‌స్టేషన్లకు చెందిన ఎస్‌ఐలతో పాటు పోలీసులు, ఇద్దరు సీఐలు, స్పెషల్‌ఫోర్స్ పోలీసులు పట్టణంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా ఈకేసులో ఇంకా 40 మందిని చేర్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. దీంతో పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కక్ష గట్టి అనవసరంగా కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. కోర్టులో బెయిల్ తీసుకొని నాయకులు ఇళ్లకు చేరుకొన్నా పోలీసులు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తుండడం గమనార్హం. రెండురోజులుగా జరుగుతున్న సంఘటనలు నియోజకవర్గంలో సంచలనం కలిగించాయి.


