నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
● చీఫ్ జనరల్ మేనేజర్ జానకి రామ్
● నిమ్మనపల్లె మండలంలో
‘కరెంటోళ్ళ జనంబాట’
నిమ్మనపల్లె : గృహ వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా కరెంటోళ్ల జనంబాట కార్యక్రమం చేపట్టినట్లు విద్యుత్ శాఖ తిరుపతి చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) జానకిరామ్ అన్నారు. శుక్రవారం నిమ్మనపల్లె మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ బాలినాయన పల్లెలో కరెంటోళ్ళ జనం బాట కార్యక్రమంలో విద్యుత్ శాఖ మదనపల్లె డీఈ గంగాధరంతో కలిసి పాల్గొన్నారు. విద్యుత్ సిబ్బందితో ఇంటింటా పర్యటించారు. విద్యుత్ సమస్యలు ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో విద్యుత్ కనెక్షన్, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ చర్యలపై క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు.అంతరాయాలను నివారించేందుకు పలు సూచనలు చేశారు. తరచూ ఏర్పడుతున్న అంతరాయాలను గుర్తించేందుకు 33 కేవీ ఫీడర్స్, 11కేవీ ఫీడర్లు ఎంపిక చేసుకొని, సర్వే చేసి లోపాలను పీఎంఐ సర్వే మొబైల్ యాప్‌లో నమోదుచేస్తారన్నారు. ఇందులో భాగంగా గాలి వీచేటప్పుడు చెట్ల కొమ్మలు తగలడం, ఒరిగిన, తుప్పుపట్టిన, పొట్టి విద్యుత్ పోల్స్, స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండి వేలాడుతున్న వైర్లు, ఇన్సులేటర్ పగుళ్లు, సపోర్ట్ వైర్లు, సపోర్ట్ స్తంభాలు లేకపోవడం తదితర సమస్యలను గుర్తించి, నమోదుచేసి అంతరాయాలను త్వరితగతిన పూర్తిగా సరిచేసి, వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామాలకు వెళ్ళినప్పుడు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను అధికారులకు తెలియజేయాలన్నారు. ఆ సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తారన్నారు. పొలాల వద్ద స్టార్టర్లు, ఎర్తింగ్ భద్రత చర్యలపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సోలార్ విద్యుత్, ఆన్‌లైన్ విద్యుత్ పేమెంట్లు, విద్యుత్ ఆదా, వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నిరంతరం విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్ అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ నాగరాజ, ఎల్‌ఎంలు పూర్ణ కుమార్, గోవిందరాజులు, ఏఎల్‌ఎంలు నరసింహులు, షామీర్ భాష, జెఎల్‌ఎంలు హర్షవర్ధన్, నరేంద్ర, అశోక్, చలపతి తదితరులు పాల్గొన్నారు.


