తక్కువ వ్యయంతోనే అన్నమయ్య ప్రాజెక్టు
మంత్రి నిమ్మల
రాజంపేట: తక్కువ వ్యయంతో అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం రాజంపేటలో టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తి అయ్యేలోపు లిఫ్ట్ ద్వారా కాలువలకు నీరందించే అంశంపై దృష్టి పెడతామన్నారు. ఎన్‌టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాయలసీమలో ఎంత అద్భుత స్పందన వచ్చిందో, అదే స్పందన 2024లో వచ్చిందన్నారు. ఇరిగేషన్ రంగంలో తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్, హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సీ, ఇలా ఎన్నో ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే నిర్మించామన్నారు. రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టుల కంటే రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టుకు అత్యధికంగా బడ్జెట్‌లో రూ.3240 కోట్లు కేటాయించామన్నారు. ఒంటిమిట్ట భూకబ్జాదారులను కఠినంగా శిక్షిస్తామన్నారు. యువనేత లోకేష్ సారధ్యంలో జరుగుతున్న మహానాడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


