అతిథి గృహం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ
బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై బీఎస్‌ఎన్‌ఎల్ భవనాల్లో లీజుదారు ఏర్పాటు చేసుకున్న అతిథి గృహ సముదాయాన్ని శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం కేంద్ర టెలికాం శాఖ తన నిరర్థక ఆస్తులను లీజుకు అప్పగించింది. మదనపల్లికి చెందిన వ్యక్తి ఈ లీజును టెండర్ ద్వారా దక్కించుకున్నారు. తర్వాత అతిథి గృహ పనులు చేపట్టారు. దీన్ని గుర్తించిన గత కలెక్టర్ గిరీషా బీఎస్‌ఎన్‌ఎల్ కు కేటాయించిన భూమిని రద్దు చేసి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే భారీ మొత్తంలో లీజుదారు ఖర్చుచేసి ఉండడంతో మదనపల్లె గత ఆర్డీవో, టౌన్షిప్ కమిటీ తరఫున టెలికాం శాఖ నుంచి లీజు పొందిన లీజుదారుకే మళ్లీ నెలవారి అద్దె లీజు ప్రాతిపదికన అప్పగించారు. అయితే నిర్వహణ చర్యలో భాగంగా లోటుపాట్లను గుర్తించడం, మురికినీరు రోడ్డు, గాలిబండ పైకి ప్రవహించడంతో పర్యాటకులకు అసౌకర్యంగా ఉందని అధికారులు గుర్తించారు. దీన్ని నిర్లక్ష్యంగా చూపించి శుక్రవారం అతిథి భవనాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ అజారుద్దీన్ కురబలకోట డిస్కం ఏఈకి ఉత్తర్వు జారీ చేశారు. అనంతరం తహసీల్దార్ అతిథి గృహాలను పరిశీలించి సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ బస చేసిన వారిని పర్యాటకశాఖ అతిథి గృహాలకు తరలించారు. దీనిపై లీజుదారులు మాట్లాడుతూ మురికి నీరు ప్రవాహం కోసం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని పలుమార్లు లేఖల ద్వారా అధికారులను కోరడం జరిగిందని చెప్పారు. అనుమతి లేకపోవడంతో పనులు చేపట్టలేక పోయినట్టు చెప్పారు. అయితే మురికినీరు ప్రవాహమే కారణంగా చూపి స్వాధీనం చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


