రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ విజేత అన్నమయ్య జట్టు
మదనపల్లె సిటీ : స్థానిక నిమ్మనపల్లె రోడ్డులోని వశిష్ట పాఠశాలలో ఆదివారం జరిగిన 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల,బాలికల షూటింగ్‌బాల్ పోటీల్లో అన్నమయ్య జిల్లా బాల,బాలికల జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గెలుపు, ఓటములు సహజమని ఓడినా, గెలిచినా సమానంగా తీసుకోవాలన్నారు. తమిళనాడులో జరగబోయే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు అన్ని జిల్లాల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నామని రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుశురాముడు తెలిపారు. పోటీల నిర్వాహకులు నరేష్‌బాబు, గోల్డెన్‌వ్యాలీ రమణారెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డి, పీడీలు గురు, బాలాజీ, గురుభాస్కర్, అంజనప్ప, భారతి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
బాలికల విభాగంలో ప్రథమ స్థానం అన్నమయ్య జిల్లా, ద్వితీయ స్థానం చిత్తూరు జిల్లా, తృతీయ స్థానం తిరుపతి జిల్లా, నాలుగో స్థానంలో కర్నూలు జిల్లా జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానం అన్నమయ్య జిల్లా, ద్వితీయ స్థానం ఏలూరు జిల్లా, తృతీయస్థానం చిత్తూరు జిల్లా, నాలుగో స్థానం సత్యసాయి జిల్లా జట్లు సాధించాయి.


