మదనపల్లె : ఓ యువకుడు మరో ముగ్గురిపై రాళ్లతో దాడి చేయడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. చిప్పిలికి చెందిన లడ్డూ (32) టౌన్‌లోకి వెళ్లి రావాల్సి ఉందని మండలంలోని జంగాలపల్లెకు చెందిన ఆదికేశవ (40)ను ద్విచక్రవాహనం ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో అతను వాహనంలో పెట్రోల్ లేదని, ఇవ్వలేనని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న లడ్డూ..తాను అడిగితే బండి ఇవ్వవా అంటూ ఆదికేశవతో పాటుగా వేంపల్లెకు చెందిన చరణ్ (30), అంకిశెట్టిపల్లెకు చెందిన సుమంత్ (31)లతో గొడవపడ్డాడు. ఘర్షణలో ముగ్గురిపై రాళ్లతో దాడిచేశాడు. దాడిలో ఆదికేశవ తీవ్రంగా గాయపడగా, చరణ్, సుమంత్‌లు సైతం గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు.
13 మందిపై రౌడీషీట్ కేసులు
రాయచోటి టౌన్ : పిల్లలపై నేరాలకు పాల్పడిన 13 మందిపై రౌడీ షీట్ కేసులు నమోదు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయచోటిలో గత రెండేళ్ల కాలంలో మైనర్లపై దాడులకు పాల్పడిన వారిపై నిఘా ఉంచామన్నారు. అలాంటి వారిలో 13 మందిని గుర్తించి రౌడీషీట్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చిన్న పిల్లలు, మహిళలపై దాడులకు పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అరటి తోటలను
పరిశీలించిన మంత్రి సవిత
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో శనివారం రాత్రి భారీ ఈదురు గాలులు, వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను సోమవారం రాష్ట్ర మంత్రి సవిత పరిశీలించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నేర్జాంపల్లె గ్రామంలో పర్యటించి అక్కడ తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చించారు. అనంతరం పార్నపల్లె గ్రామంలో దెబ్బతిన్న అరటి పంటలను, తమలపాకు తోటలను పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె రైతులకు హామీ ఇచ్చారు.
ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లో పోటాపోటీగా క్రికెట్ పోటీలు
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పోటాపోటీగా క్రికెట్ పోటీలు జరిగాయి. సోమవారం ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లోని ఆట స్థలంలో స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు నిర్వహించారు. దీంతో టీచింగ్, నాన్ టీచింగ్ మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో టెక్నికల్ టైగర్స్ జుట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన ఆర్‌కేవీ రైడర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లలో 78 పరుగులు చేయగా.. బ్యాటింగ్‌కు దిగిన టెక్నికల్ టైగర్స్ జుట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే 79 పరుగులు చేసి విజయం సాధించింది. విజేతలను డైరెక్టర్ కుమార స్వామి గుప్తా అభినందించారు.
రాళ్ల దాడిలో ముగ్గురికి గాయాలు


