పరీక్షల వేళ .. పట్టుజారితే ప్రమాదం!
గుర్రంకొండ : పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఇష్టానుసారం ద్విచక్రవాహనాల్లో పరీక్షా కేంద్రాల వద్దకు వస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు నుంచి నలుగురు విద్యార్థులు ఒకే ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాసిన తరువాత పరీక్షా కేంద్రాల వద్దనే రోడ్డుపై సర్కస్ ఫీట్లు చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పరీక్షలు రాసే ఇలాంటి సమయాల్లో పట్టుజారి ప్రమాదాలకు గురైతే వారి పరిస్థితి ఏంటని ఈ దృశ్యాలను చూసిన వారు చర్చించుకుంటున్నారు.
జాతీయ రహదారిపై అజాగ్రత్తగా..
అన్నమయ్య జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కువగా ద్విచక్రవాహనాల్లో వచ్చే విద్యార్థుల సంఖ్య కనిపిస్తోంది. గుర్రంకొండలోని తెలుగు, ఉర్దూ జెడ్పీ హైస్కూళ్లలో 324 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పలువురు విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై పరీక్షా కేంద్రాలకు వస్తున్నారు. అదికూడా ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు నుంచి నలుగురు కలిసి ప్రయాణిస్తుండడం గమనార్హం. ఎన్‌హెచ్ 340 కడప–బెంగళూరు జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్న ఈ రెండు జెడ్పీ హైస్కూళ్లు జాతీయ రహదారికి పక్కనే ఉన్నాయి. దీంతో వేగంగా పరీక్షా కేంద్రాలకు ద్విచక్రవాహనాలపై వచ్చే విద్యార్థులు పట్టుజారి ప్రమాదాల బారిన పడితే వారి భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కనీసం ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా విచక్షణ లేకుండా పదో తరగతి పరీక్షలు రాసే తమ పిల్లలకు ద్విచక్రవాహనాలు ఇచ్చి పంపిస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దృశ్యాలను పోలీసులు గమనిస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుండడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. పోలీసులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సి ఉంది.
విన్యాసాలతో వికృత చేష్టలు..
పరీక్షలు రాసిన అనంతరం పలువురు విద్యార్థులు తమ ద్విచక్రవాహనాల్లో ఏకంగా ముగ్గురిని కూర్చోబెట్టుకొని సర్కస్‌ఫీట్లు చేస్తున్నారు. కొంతమంది విద్యార్థినులను వెంబడిస్తూ వేగంగా వారి ముందువైపు వాహనాలను నడుపుతూ ప్రమాదకర ఫీట్లు చేస్తుండడం దారుణం. ద్విచక్రవాహనాల్లో వచ్చే వి ద్యార్థులు పరీక్షా సమయం ముగిసినా ఇళ్లకు వెళ్లకుండా రోడ్లపై ఇష్టానుసారం వేగంగా వాహనాలు నడుపుతూ పరీక్షా కేంద్రాల వద్దనే చక్కర్లు కొడుతూ భయంకర విన్యాసాలకు పాల్పడుతున్నారు.
ద్విచక్ర వాహనాల్లో పరీక్షా కేంద్రాలకు మైనర్ విద్యార్థులు
ఒకే వాహనంలో ముగ్గురి నుంచి నలుగురు ప్రయాణం
పరీక్షా కేంద్రం వద్దే ద్విచక్రవాహనాలతో సర్కస్ ఫీట్లు
పరీక్షల వేళ .. పట్టుజారితే ప్రమాదం!


