హార్సిలీహిల్స్‌లో వెలగని లైట్లపై సబ్ కలెక్టర్ సీరియస్
బి.కొత్తకోట: హార్సిలీహిల్స్‌పై వెలగని లైట్ల విషయమై మదనపల్లె సబ్‌కలెక్టర్, హార్సిలీహిల్స్ టౌన్‌షిప్ కమిటీ చైర్మన్ మేఘస్వరూప్ సీరియస్ అయ్యారు.దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ‘హార్సిలీహిల్స్‌కు వెలుగులు ఎప్పుడు‘ శీర్షికతో ఆదివారం ప్రచురితమైన కథనంపై సబ్ కలెక్టర్ స్పందించారు. విద్యుత్‌శాఖ సిబ్బందితో మాట్లాడిన సబ్‌కలెక్టర్ కార్యాలయ సిబ్బంది అసలు సమస్య ఎక్కడున్నది ఆరా తీశారు. దీనిపై విద్యుత్‌శాఖ, కాంట్రాక్టర్ హార్సిలీహిల్స్‌కు పరుగులు తీశారు. టెండర్‌లో హైమాస్ లైట్లు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ వాటి నిర్వహణ బాధ్యతలు చూడాలన్న నిబంధన ఉంది. సబ్ కలెక్టర్ ఆదేశాలతో కొండపై ఐదుచోట్ల ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను పరిశీలించారు. వాటికి స్విచ్‌బోర్డులు ధ్వంసం కావడం, సరైన విద్యుత్ సరఫరా వైర్లు లేకపోవవడం, పైన అమర్చిన లైట్లు పగిలిపోవడం లేదా కాలిపోవడాన్ని గుర్తించారు. మెయిన్ స్విచ్‌లు మార్చాలని, కంట్రోల్ ప్యానళ్లు అమర్చాలని గుర్తించారు. గాలిబండలపై రెండు, గుడి వద్ద ఒకటి హైమాస్ లైట్లు వెలగకపోవడానికి ఇవే కారణమని నిర్ధారించారు. అలాగే ఒకదానికి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయాలని లైన్ ఇన్స్‌పెక్టర్ రామలింగారెడ్డి చెప్పారు. అంథకారంలో ఉంటున్నామని, రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నామని పర్యాటకులు, స్థానికులు చెప్పారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
● తక్షణమే చర్యలకు ఆదేశం
హార్సిలీహిల్స్‌లో వెలగని లైట్లపై సబ్ కలెక్టర్ సీరియస్


