రాయచోటి అర్బన్ : జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ మిగులు భూములను పేద గిరిజనులు, దళితులను పంపిణీ చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు క్రిష్ణప్ప డిమాండ్ చేశారు. రాయచోటి జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మొలకలచెరువు, గుడుపల్లె వద్ద గల 270 ఎకరాల చెన్నప్పగారిగడ్డ స్త్రోత్రియం భూములను పేదలకు పంపిణీ చేయాలన్నారు. ఓబులవారిపల్లె మండలం వైకోట గ్రామం బాల్‌రెడ్డిగారిపల్వె వద్ద 200 ఎకరాలు, పుల్లంపేట మండలం రంగంపల్లె పంచాయతీ కరరుపాకురాజు పల్లె వద్ద వంద ఎకరాల భూములను అర్హులైన పేదలు సాగు చేసుకునేందుకు ఇవ్వాలని కోరారు. ఫ్రీహోల్డ్ కింద పెట్టడంతో దళితులు, గిరిజనులు నష్టపోతారని అన్నారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న వాగులు, వంకలు, చెరువులు, కుంటలను కాపాడాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జయరామయ్య, వినయ్, వెంకటరమణ, వెలుగురమణ, వెంకట నరసమ్మ, మల్లిక వెంకటరమణ, శంకర, మునికోటయ్య, రామప్ప పాల్గొన్నారు.


